బుద్ధి చెప్పిన హనుమంతుడు

బుద్ధి చెప్పిన హనుమంతుడు
త్యాగయ్య కీర్తి ప్రతిష్ఠలు దశ దిశలా వ్యాపిస్తూ ఉండటాన్ని ఆయన వదిన భరించలేకపోతుంది. త్యాగయ్య పూజిస్తోన్న సీతారాముల విగ్రహాలను ఆమె మాట కాదనలేకే ఆమె భర్త కావేరీ నదిలో పారేస్తాడు. అలాంటి పరిస్థితుల్లోనే త్యాగయ్య సంగీత పరిజ్ఞానానికి ఆయన దగ్గర గల 'స్వరార్ణవం' కారణమనే విషయం, రాజనర్తకి అయిన 'చపలాక్షి' కి తెలుస్తుంది. సంగీతంలో కూడా ప్రవేశం వుండటం వలన ఆమె ఆ గ్రంధాన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటుంది.

త్యాగయ్య వదినకి గల ధన వ్యామోహం గురించి తెలుసుకున్న చపలాక్షి, రహస్యంగా ఆమెను కలిసి కొంత ధనాన్ని ముట్టజెబుతుంది. త్యాగయ్య ఇంట్లో వున్న స్వరార్ణవం గ్రంధాన్ని తనకి అందజేయమని కోరుతుంది. ధనానికి ఆశపడిన ఆమె అందుకు అంగీకరిస్తుంది. ఈ విషయంలో త్యాగయ్య అన్నగారు కూడా ధన వ్యామోహం నుంచి బయటపడలేకపోతాడు.

త్యాగయ్య ఇంట్లోలేని సమయంలో ... ఆయన భార్య నిద్రిస్తోన్న సమయంలో ఆ గ్రంధాన్ని కాజేయాలని ఆ దంపతులు నిర్ణయించుకుంటారు. ఊరంతా నిద్రలోకి జారుకోగానే త్యాగయ్య ఇంట్లోకి ఆయన అన్నయ్య రహస్యంగా ప్రవేశిస్తాడు. స్వరార్ణవం గ్రంధం గురించి ఆయన వెదుకుతూ ఉంటాడు. త్యాగయ్యకి తెలియకుండానే ఆయనని కాపాడుతూ వస్తోన్న హనుమంతుడు అక్కడ ప్రత్యక్ష మవుతాడు. వంచనకి పాల్పడుతోన్న ఆయన అన్నావదినలకు తగిన విధంగా బుద్ధిచెప్పాలని అనుకుంటాడు.

పూజా మందిరంలో వెలుగుతున్న దీపం ద్వారా తన తోకకి నిప్పు అంటించుకుని, దానిని త్యాగయ్య అన్నయ్య వస్త్రాలకి అంటిస్తాడు. వళ్లంతా మంటలు అంటుకోవడంతో, ఆయన భయంతో కంపించిపోతాడు. ఆ ప్రమాదం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఆయన వస్త్రాలను విప్పేసి గోడవతల పడేస్తాడు. ఆయన అందించే గ్రంధం కోసం అక్కడ కాచుకుని కూర్చున్న భార్యపై ఆ వస్త్రాలు పడటంతో ఆమెకి మంటలు అంటుకుంటాయి.

కాలిన గాయాలతో వాళ్లు అరుస్తూ వుండగా, త్యాగయ్య భార్యకి మెలకువ వస్తుంది. మంచి మనసున్న ఆమె వాళ్లిద్దరికీ సేవలు చేస్తుంది. అసలు విషయం ఆమెకి చెప్పుకోలేక, ఆ విషయాన్ని మనసులో దాచుకోలేక ఆ దంపతులు మరింత విలవిలలాడిపోతుంటారు. త్యాగయ్య వంటి మహా భక్తుడికి ద్రోహం తలపెట్టినందుకు తమకి దేవుడు తగినశాస్తి చేశాడనే విషయం మాత్రం వాళ్లకి అర్ధమైపోతుంది.

More Bhakti Articles