అక్షింతల మహిమ

అక్షింతల మహిమ
ఒకసారి శ్రీ రాఘవేంద్రస్వామి ఒక గ్రామంలోని ఆలయాన్ని దర్శిస్తాడు. ఆ గ్రామస్తులంతా వచ్చి ఆయనను దర్శించుకుని, ఆశీస్సులు తీసుకుంటూ వుంటారు. ఆలయ ద్వారం చెంత నుంచుని, రాఘవేంద్రస్వామిని చూడాలని ఒక వ్యక్తి ఆరాటపడుతూ వుంటాడు. అది గమనించిన రాఘవేంద్రుడు, ఆ వ్యక్తిని లోపలికి రమ్మని చెబుతాడు. ఆయన తక్కువ కులానికి చెందిన వాడంటూ కొందరు అభ్యంతరాన్ని వ్యక్తం చేసినా, రాఘవేంద్రస్వామి పట్టించుకోడు.

ఆ వ్యక్తి స్వామి ఆశీస్సులు తీసుకుని, తాను తెచ్చిన 'ఆవాలు' ను స్వామికి అందజేస్తాడు. ఆ వ్యక్తి పేదరికాన్ని ... ప్రేమను అర్ధం చేసుకున్న స్వామి, వాటిని స్వీకరిస్తాడు. మధ్యాహ్నపు వంటలో వాటిని ఉపయోగించమని శిష్యులకు చెబుతాడు. రాఘవేంద్ర స్వామి ఆ విధంగా చేయడం ఆయన భక్త బృందంలోని ఒక వ్యక్తికి అసహనాన్ని కలిగిస్తుంది. అక్కడ వుంటే ఆ ఆవాలను కలిపిన భోజనం చేయవలసి వస్తుందని భావించిన ఆ వ్యక్తి, ఇంటికి బయలుదేరుతూ స్వామి ఆశీస్సులు తీసుకుంటాడు.

స్వామి ఇచ్చిన అక్షింతలు తీసుకుని అక్కడి నుంచి బయటికి నడచిన ఆ వ్యక్తి, కంగారుపడిపోతూ వెంటనే లోపలికి వస్తాడు. తన చేతిలోని అక్షింతలు నల్లగా మారిపోయాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తాడు. మనసులోని మాలిన్యం అక్షింతలకు అంటుకుందని స్వామి సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి బిత్తరపోయాడు.

తన మనసులోని ఉద్దేశం స్వామికి తెలిసి పోయినందుకు సిగ్గుపడతాడు. భగవంతుని దృష్టిలో అంతా సమానమేననీ, ఆ విషయం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మన్నించమని ప్రాధేయపడతాడు. అంతే అంతా చూస్తుండగానే ఆయన చేతిలోని అక్షింతలు తిరిగి పసుపు రంగులోకి మారిపోయాయి. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లంతా స్వామి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు.

More Bhakti Articles