ఏ రోజుల్లో బూజు దులపకూడదు?

 ఏ రోజుల్లో బూజు దులపకూడదు?
ఒకప్పుడు ఎక్కడ చూసినా మిద్దెలు ... పెంకుటిళ్లు ఎక్కువగా కనిపించేవి. బండలు వేయబడిన ఇళ్లు బహు అరుదుగా మాత్రమే ఉండేవి. అందువలన పండుగ వస్తుందంటే చాలు, ఇల్లు అలుక్కోవడం ... బూజు దులుపుకోవడం పెద్దపనిగా వుండేది. కాలక్రమంలో మిద్దెలు ... పెంకుటిళ్లు చాలా వరకూ మేడలుగా మారిపోయాయి. అందువలన అలకడం తప్పిందిగానీ, బూజు మాత్రం దులుపుకోవలసి వస్తూనే వుంది.

ఇక మట్టి రోడ్డు పక్కనే గల ఇళ్లలోను ... మండువా ఇళ్లలోను బూజు ఎక్కువగా ఉంటూ వుంటుంది. సాధారణ రోజుల్లో ఇతర పనులతో సతమతమైపోయేవాళ్లు, పండుగ వస్తుందనగానే బూజు దులిపే పనికి శ్రీకారం చుడతారు. పండుగరోజు నాటికి ఇల్లంతా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో, ముందు రోజున బూజు దులిపేందుకు రంగంలోకి దిగుతుంటారు.

ఈ నేపథ్యంలో పండుగ ముందురోజు ఏ వారమైందనే విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. ఆ రోజున మంగళవారమైనా ... శుక్రవారమైన తమపని కానిచ్చేస్తూనే వుంటారు. అయితే శాస్త్రం మాత్రం ఈ రెండు రోజుల్లో బూజు దులపకూడదని చెబుతోంది. బూజు ఏర్పడటానికి కారణమయ్యే సాలెపురుగును 'శ్రీ' అంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అనే అర్థం కూడా వస్తుంది.

అందువలన అమ్మవారికి ఇష్టమైన రోజున బూజు దులపకూడదనీ, దులిపితే అమ్మవారిని సాగనంపినట్టే అవుతుందని అంటారు. ఇక మంగళవారం మొదలుపెట్టిన పని మళ్లీ .. మళ్లీ చేయవలసి ఉంటుందని అంటారు కనుక, ఆ రోజున బూజు జోలికి పోకూడదని చెబుతుంటారు. ఈ నియమాన్ని పాటించకపోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరం కావలసి వస్తుందని అంటారు. అందువలన శాస్త్రం సూచించిన నియమాలను పాటించడమే అన్ని విధాలా మంచిదని చెప్పకతప్పదు.

More Bhakti Articles