శక్తి క్షేత్రం

శక్తి క్షేత్రం
శ్రీ చక్రమేరు మహా శక్తిమంతమైనదని పురాణాలు చెబుతున్నాయి. సమస్త దేవతలు శ్రీచక్రంలో నెలకొని ఉండగా, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు బిందు రూపంలో కొలువై ఉంటుంది. మహిమాన్వితమైన శ్రీ చక్రమేరును దర్శించడం వలన ... పూజించడం వలన పాపాలు పటాపంచలవుతాయి.

అమ్మవారి ఆలయాల్లో ఆమె నివాస స్థానమైన శ్రీ చక్రమేరును భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మరికొన్ని క్షేత్రాల్లో శ్రీచక్ర ఆరాధనే ప్రధానంగా కనిపిస్తూ వుంటుంది. మరో ప్రత్యేకతను సంతరించుకుంటూ విశాఖ జిల్లాలోని 'దేవీపురం' క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ ఆలయమే శ్రీచక్రమేరు ఆకారంలో నిర్మించారు. దేవీ ఉపాసకుడైన ఓ భక్తుడు, అమ్మవారి ఆదేశం మేరకు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతారు.

అమ్మవారు సూచించిన స్థలంలోనే పంచలోహ శ్రీ చక్రమేరు లభించిందనీ, ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించడం జరిగిందని అంటారు. ప్రకృతి మాత అనే పేరును సార్ధకం చేసుకుంటూ అమ్మవారు ప్రకృతి ఒడిలో కొలువుదీరి కనిపిస్తుంది. గర్భాలయంలో అమ్మవారు విశాల నేత్రాలతో ... చక్కని ముక్కెరతో కళకళలాడుతూ వుంటుంది. ఆనందభైరవుడిగా ఇక్కడ కొలువైన శివుడే, క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఇక్కడ ఎటు వైపు చూసినా శివలింగాలే దర్శనమిస్తూ వుంటాయి. 365 శివలింగాలను ఏక శివలింగ రూపంలో రూపొందించగా, భక్తులు దానికి స్వయంగా అభిషేకం చేస్తుంటారు. ఈ విధానం వలన ఏడాది పాటు స్వామికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది. పర్వదినాల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు జరుపుతుంటారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఆ తల్లి ఆశీస్సులతో సుఖ సంతోషాలను పొందుతూ వుంటారు.

More Bhakti Articles