శ్రీ ఫలం విశిష్టత

జీవితమంటేనే సుఖదుఃఖాల కలయిక. సుఖాలు అనుభవించేటప్పుడు తమంతటి వాళ్లు లేరని అనుకునేవాళ్లు, కష్టాలు ఎదురవ్వగానే కంగారుపడిపోతుంటారు. సమస్యలనేవి ఎన్ని రూపాల్లో వున్నా ... ఎన్ని రకాలుగా వున్నా ఆర్ధిక పరిస్థితి బాగా వుంటే వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి అవకాశం వుంటుంది. అసలు సమస్యే ఆర్ధిక పరిస్థితి అయినప్పుడు ఎవరైనా సరే వెంటనే డీలాపడిపోతుంటారు.

ఆర్ధికంగా బలంగా వున్నప్పుడు మిగతా సమస్యలు ఎదురైతే పరిష్కార మార్గాన్ని ఆలోచించే శక్తి వుంటుంది. ఇక ఆర్ధికపరమైన ఇబ్బంది ఎదురైతే, దాని బారి నుంచి బయటపడటానికి తగిన మార్గాన్ని అన్వేషించే పరిస్థితి కూడా వుండదు. అందుకే అంతా ఆర్ధికంగా బలపడాలనీ ఆశపడుతుంటారు ... ఆరాటపడుతుంటారు. ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే ఎవరికైనా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండవలసిందే. ఆమె అనుగ్రహాన్ని సాధించి పెట్టేదే 'శ్రీఫలం' అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

'శ్రీ ఫలం' లక్ష్మీ స్వరూపంగా చెప్పబడుతోంది. అల్పపరిమాణంలో కనిపించే ఈ కొబ్బరికాయ, సముద్ర తీరాల్లో ఎక్కువగా లభిస్తూ వుంటుంది. అరుదుగా లభించే శ్రీ ఫలాన్ని ఇంటికి తీసుకు వచ్చి పూజా మందిరంలో ఉంచాలి. శుక్రవారం మంచి ముహూర్తం చూసుకుని ఆ శ్రీ ఫలాన్ని తెల్లని వస్త్రంలో వుంచి లక్ష్మీ స్తోత్రాలతో పూజించాలి.

శ్రీ ఫలానికి ధూప .. దీప .. నైవేద్యాలను చూపించాక, అదే వస్త్రంలో మూటగట్టాలి. పునఃపూజ చేసిన అనంతరం మూటగట్టబడిన శ్రీ ఫలాన్ని ధనాన్ని భద్రపరిచే చోట ఉంచాలి. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆమె కరుణా కటాక్ష వీక్షణాల కారణంగా సంపదలు ... సంతోషాలు కలుగుతాయి.


More Bhakti News