విజయాన్నిచ్చే వినాయక క్షేత్రం

విజయాన్నిచ్చే వినాయక క్షేత్రం
ప్రారంభించిన ప్రతి కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా సక్రమంగా పూర్తికావాలంటే వినాయకుడి అనుగ్రహం ఉండవలసిందే. ఇక ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంలో విజయాన్ని సాధించాలంటే వినాయకుడి ఆశీస్సులు కావాల్సిందే. వినాయకుడి అనుమతి లేకుండా ఏ పనిని ప్రారంభించలేమనీ ... పూర్తి చేయలేమని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ప్రతి ఒక్కరు ఆయన కరుణాకటాక్ష వీక్షణాల కోసం కాచుకు కూర్చుంటారు.

వినాయకుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ... గుంజీళ్ళు తీసి ... బెల్లంతో చేసిన నైవేద్యాలు పెడితే చాలు, భక్తులు తలపెట్టిన కార్యాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకుంటాడు. అంతటి చల్లని మనసున్న వినాయకుడు వివిధ ప్రదేశాల్లో కొలువై, అసంఖ్యాకంగా వున్న తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'ఖమ్మం' కనిపిస్తుంది.

ఇక్కడ కొలువుదీరిన గణపతిని మనస్పూర్తిగా విశ్వసిస్తూ ఏదైనా కోరుకుంటే చాలు, చాల తొందరగా ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఆయనకి నమస్కరించి ఆశీస్సులు తీసుకుని వెళ్లిన వాళ్లకి తప్పక జయం కలుగుతుందని అంటారు. ఈ కారణంగానే ఆయనని అంతా 'విజయ గణపతి' అని పిలుస్తుంటారు. వివిధ రకాల శివకేశవ ప్రతిమలతో ... గణపతి రూపాలతో ఆలయ ప్రాంగణం ఆహ్లాదకరంగా వుంటుంది.

గర్భాలయంలో స్వామి రూపం నయనమనోహరంగా దర్శనమిస్తుంది. అందువలన ఆయన పేరుకు ముందు 'సుందర' ని కూడా జోడిస్తుంటారు. ప్రతి బుధవారం స్వామివారికి వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో ... ఫల రసాలతో అభిషేకం నిర్వహిస్తుంటారు. పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక అలంకరణలు ... పూజలు జరుగుతూ వుంటాయి. భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగే ఈ వేడుకలు భక్తులకు నయనానందాన్ని కలిగిస్తుంటాయి ... వారికి సకల శుభాలను అందిస్తుంటాయి.

More Bhakti Articles