బందిపోటును అడ్డుకున్న బాబా

కాణాభిల్లుడు అనే బందిపోటు దారి దోపిడీలకు పాల్పడుతూ ఉండేవాడు. అవసరమైతే హత్యలు చేయడానికి కూడా ఆయన వెనుకాడకపోతుండటంతో, ఆయన పేరు చెబితేనే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు భయపడుతూ వుండేవాళ్లు. దాసగణు అనే బాబా భక్తుడు ఆ ప్రాంతంలోనే పోలీసు అధికారిగా పనిచేస్తూ ఉండేవాడు.

కష్టం వచ్చినప్పుడల్లా ఇక వుద్యోగం మానేసి బాబా దగ్గరికి వెళ్లి ఆయన సేవ చేసుకోవాలని అనుకుంటూ ఉండేవాడు. అయితే ఆ కష్టం కాస్తా తీరిపోయాక,ఆ విషయాన్ని మరిచిపోతూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి కాణాభిల్లుడి ఆచూకి దాసగణుకి తెలిసింది. అంతే వెంటనే మరికొంత మంది అధికారులను వెంటబెట్టుకుని ఆ కొండ ప్రదేశానికి చేరుకున్నాడు.

కాణాభిల్లుడిని బంధించడం కోసం పోలీసులంతా కొండను చుట్టుముట్టారు. కొండపై గల గుహలో కాణాభిల్లుడు ఉండవచ్చని భావించి, అక్కడికి చేరుకున్నాడు దాసగణు. ఒక్కసారిగా అతనిపై కాణాభిల్లుడు దాడిచేసి పట్టుకున్నాడు. దాంతో ఇక తన ప్రాణాలు పోవడం ఖాయమనే విషయం దాసగణుకి అర్థమైపోయింది.

తన దారికి అడ్డుపడుతోన్న దాసగణుని అంతం చేయాలని కాణాభిల్లుడు నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా కత్తితో దాసగణు పైకి దూసుకొచ్చాడు. అనుకోకుండానే ''బాబా'' అంటూ పెద్దగా అరిచాడు దాసగణు. అంతే కాణాభిల్లుడు మంత్రం వేసినట్టుగా ఆగిపోయాడు. ఎంతగా ప్రయత్నించినా ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. ఏదో శక్తి అతణ్ణి చంపకుండా అడ్డుపడుతుందనీ, ఇక తన కంటికి కనిపించకుండా వెళ్లిపొమ్మని వదిలేశాడు.

తన ప్రాణాలు కాపాడినది సాయిబాబాయేననే విషయం దాసగణుకి అర్థమైపోయింది. అంతే ఉన్నపళంగా వుద్యోగం మానేసి షిరిడీ వచ్చి బాబా పాదాలపై పడ్డాడు. తన ప్రాణాలు కాపాడినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలియజేసి, జీవితాంతం ఆయన సేవ చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు.


More Bhakti News