పనివాడిగా వచ్చిన పాండురంగడు

పనివాడిగా వచ్చిన పాండురంగడు
గోరాకుంభార్ ఒక్కగానొక్క సంతానమైన విఠలుడు చనిపోవడంతో ఆ దంపతులు తీవ్రమైన మనోవేదనకు లోనవుతారు. అలాంటి పరిస్థితుల్లోనే ఇక తాను భార్యను తాకనంటూ పాండురంగడిపై గోరా ఒట్టు పెట్టుకుంటాడు. అయితే వంశాంకురం కావాలనే ఉద్దేశంతో ఆమె తన చెల్లెలిని ఒప్పించి, తన భర్తతో ఆమె పెళ్లి జరిపిస్తుంది. రెండో భార్య విషయంలోను గోరా అదే ఒట్టుకి కట్టుబడి వుంటాడు.

అయితే అనుకోకుండా ఆయన ఒకసారి భార్యలను తాకుతాడు. పాండురంగడిపై ఒట్టుపెట్టి దానిని తప్పినందుకు బాధపడతాడు. భార్యను తాకిన చేతులను తీసేసుకోవడమే తాను చేసిన అపరాథానికి తగిన శిక్షగా భావిస్తాడు. వెంటనే తన రెండు చేతులను నరికేసుకుంటాడు. గోరా బాధతో విలవిలలాడిపోతుంటాడు ... రక్తం ధారగా కారుతూ వుంటుంది. ఆయన ఒట్టుపెట్టుకున్న కారణంగా భార్యలు దగ్గరికి రావడానికి సాహసించరు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆ పాండురంగడే పనివాడి వేషంలో ఆ ఇంటికి వస్తాడు. గోరా రెండు చేతులకు కట్టుకడతాడు. రెండు పూటలా అన్నం పెడితే చెప్పిన పని చేసి పెడతానంటూ ఆ ఇంట్లో పనికి కుదురుతాడు. గోరా ఇక కులవృత్తిని చేయలేడు కనుక, పనివాడిగా వచ్చిన పాండురంగడే కుండలు తయారు చేస్తుంటాడు. గోరా పూజకి అవసరమైన పూలు .... పండ్లు సమకూరుస్తుంటాడు. తాను పూజిస్తోన్న పాండురంగడే తనకి సేవలు చేస్తున్నాడని తెలియని గోరా, ఎప్పటిలానే నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ ఆ తన్మయత్వంలో తేలిపోసాగాడు.

More Bhakti Articles