బంగారం విశిష్టత

బంగారం విశిష్టత
ప్రాచీనకాలం నుంచి బంగారానికి ఎంతో విశిష్టత వుంది. స్త్రీలతో సమానంగా పురుషులు బంగారు ఆభరణాలు ధరించినట్టు చరిత్ర చెబుతోంది. బంగారం ధరించకుండా శుభకార్యాలు చేయకూడదని శాస్త్రం చెప్పడం వలన, ఆ విషయంలో అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు. అప్పట్లో తమ దగ్గర పెద్దమొత్తంలో గల నగదును భద్రపరచడానికి మార్గంలేని కారణంగా, ఆ నగదుని బంగారంగా మార్చి ధరించేవారు.

ఆ తరువాత బంగారాన్ని మాత్రమే వారసత్వ సంపదగా గుర్తించడం ... భవిష్యత్ కి సంబంధించిన భరోసాను కలిగించేదిగా భావించడం మొదలైంది. ధనికవర్గాల సరసన కనిపించాలనే తాపత్రయం కూడా బంగారానికి మరింత ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. ఆధునిక కాలంలో బంగారం అందమైన అలంకరణకు ... ఆపదలో ఆర్ధికంగా ఉపయోగపడే వస్తువుగానే అంతా భావిస్తున్నారు. అయితే పూర్వీకులు బంగారం వాడటం వెనుక ఆర్ధికపరమైన భద్రత కనిపించదు, ఆరోగ్య పరమైన రక్షణ మాత్రమే కనిపిస్తుంది.

ఈ కారణంగానే అన్ని వర్గాలవారు ... అన్ని వయసులకి చెందిన స్త్రీ పురుషులు బంగారు ఆభరణాలు ధరించారు. శిరస్సు పైన .. చెవులకు .. నాశికకు .. మెడలో .. జబ్బలకు .. ముంజేతులకు .. చేతి వేళ్లకు .. నడుముకు .. బంగారు ఆభరణాలను ధరించేవారు. ఈ విధంగా వివిధ అవయవాలను బంగారంతో అలంకరించుకోవడం వలన, ఆయా భాగాలలోని నరాలపై ఒత్తిడి జరిగి తగినంత రక్త ప్రసరణ జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. బంగారాన్ని ధరించడం వలన చర్మ వ్యాధులు .. నరాల బలహీనత .. గుండెపోటు వంటి అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని పూర్వీకులు స్పష్టం చేశారు.

చిన్న పిల్లలకు వయసును బట్టి చెవులు కుట్టించి బంగారు తీగ చుట్టించడం .. ముక్కు కుట్టించి బంగారు కాడ వుంచడం .. అన్నప్రాసన సమయంలో అన్నపు మెతుకును బంగారు ఉంగరంతో కలిపి రుచి చూపించడం .. వివాహ సమయంలో అరవంకెలు .. తాళి బొట్టు .. సీమంతం సమయంలో వడ్డాణం ధరింపజేయడం వెనుక ఆరోగ్య పరమైన కారాణాలే ఉన్నాయనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. అలంకరించుకోవడం వలన బంగారం అందాన్ని తెస్తుందనీ, చుట్టుపక్కల వారికి తమ స్తోమతని తెలియపరుస్తుందని అనుకునే వారు, ఇక ఆ ఆలోచలనలకి స్వస్తిపలకాలి. బంగారాన్ని ధరించడం వలన బంగారం వంటి ఆరోగ్యాన్ని కలిగివుంటామనే విషయాన్ని గ్రహించాలి.

More Bhakti Articles