అమ్మపల్లి

అమ్మపల్లి
రామాయణాన్ని చదవడం వలన ... వినడం వలన జీవితానికి పరిపూర్ణత ఏర్పడుతుంది. అలాగే రామాలయాన్ని దర్శించడం వలన గత జన్మల పాపం నశిస్తుంది. సీతా సమేతంగా, లక్ష్మణ ... హనుమ సహితంగా కొలువైన శ్రీరామచంద్రమూర్తిని సేవించడం వలన సమస్త దుఃఖాలు నశించి విజయాలు చేకూరతాయి. ఈ కారణంగానే అశేష భక్త జనులు నిత్యం శ్రీరాముడిని ఆరాధిస్తుంటారు ... ఆయన సేవలో తరిస్తుంటారు.

అలా పూజలు అందుకుంటోన్న శ్రీ రామ క్షేత్రాలలో 'అమ్మపల్లి' ఒకటిగా అలరారుతోంది. ఒకప్పుడు మారుమూల గ్రామంగా భావించబడుతోన్న 'అమ్మపల్లి' ... ఇప్పుడు హైదరాబాద్ - శంషాబాద్ సమీపంలో దర్శనమిస్తోంది. భాగ్యనగర నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి ముందే ఇక్కడ ఈ ఆలయం నిర్మించబడినట్టు స్థల చరిత్ర చెబుతోంది. సీతమ్మవారు కొలువై వున్న కారణంగానే ఈ ఊరికి 'అమ్మపల్లి' అనే పేరు ఏర్పడి ఉంటుందని అనుకోవచ్చు.

ఎత్తయిన రాజగోపురం ... పొడవైన ప్రాకారాలు ... సువిశాలమైన కోనేరు ... ఆశ్చర్యచకితులను చేసే ప్రాకార మంటపాలు ... నాటి ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. మహారాజుల సంకల్ప బలం ... వారి పర్యవేక్షణ కారణంగానే ఈ ఆలయం నిర్మాణం జరిగివుంటుందని అనిపిస్తుంది. గర్భాలయంలో సీతారామలక్ష్మణులు కొలువై వుండగా, వారికి ఎదురుగా ముఖమంటపంలో హనుమంతుడు నెలవై ఉంటాడు. ఇక్కడే గరుత్మంతుడు కూడా కనిపిస్తుంటాడు.

సీతారామలక్ష్మణుల ప్రతిమలు శిలా మకరతోరణాలను కలిగివుండటం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతారు. ముఖమంటపంలో 'కూర్మం' (తాబేలు) ఏర్పాటు చేయబడి వుండటం వలన ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు. ప్రతియేటా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ... వివిధరకాల సేవలు నిర్వహిస్తుంటారు. నాటి నుంచి నేటి వరకూ ఈ ఆలయం తన ప్రత్యేకతను ... విశిష్టతను ... వైభవాన్ని నిలుపుకుంటూ రావడం నిజంగా విశేషమేనని చెప్పాలి.

More Bhakti Articles