శ్రీ గాంగేశ్వర స్వామి క్షేత్రం

మహాభారత యుద్ధంలో భీష్ముడు కీలకమైన పాత్రను పోషించాడు. విశ్వమానవ కల్యాణానికి గాను ఈ లోకానికి విష్ణుసహస్రనామాలను అందించాడు. తన తండ్రి సుఖసంతోషాల కోసం తాను వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసిన త్యాగశీలి ఆయన. ఇప్పటికీ తిరుగులేని ప్రతిజ్ఞను 'భీష్మ ప్రతిజ్ఞ'గా చెప్పుకుంటూ వుంటారు. ధర్మానికి ... ధైర్య సాహసాలకు ప్రతీకగా కనిపించే భీష్ముడు, ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. అదే 'శ్రీ గాంగేశ్వర స్వామి క్షేత్రం'.
ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని 'తడికలపూడి'లో అలరారుతోంది. అలా భీష్ముడిచే ప్రతిష్ఠించబడిన ఈ శివలింగం, కాలక్రమంలో ఎంతోమంది మహర్షులచే ... రాజవంశీకులచే పూజలు అందుకుంది. ఆ తరువాత ఈ శివలింగం అంతర్హితమైపోయింది. అలా చాలాకాలం గడిచిన తరువాత, ఈ ప్రాంతానికి చెందిన కరణం తన గుర్రపుబండిపై వెళుతుండగా హఠాత్తుగా గుర్రం ఆగిపోయింది. అది ముందుకి కదలకపోవడానికి కారణాన్ని పరిశీలించగా, అక్కడి నేలలో శివలింగం పైభాగం కనిపించింది.
ఆ శివలింగాన్ని బయటికి తీయించిన కరణానికి, ఆ రాత్రి కలలో శివుడు కనిపించి, ఆలయాన్ని నిర్మించి ఆ శివలింగాన్ని అందులో ప్రతిష్ఠించమని చెప్పాడు. గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆయన ఆ పనిని పూర్తి చేశాడు. నాటి నుంచి స్వామి 'గాంగేశ్వరుడు' గా భక్తులచే నిత్య పూజాభిషేకాలు అందుకుంటూ వున్నాడు.
నిర్మాణపరంగా ఆలయం ప్రాచీనతకు అద్దంపడుతూ వుంటుంది. గర్భాలయంలో శివలింగం దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ వుంటుంది. స్వామివారితో పాటు పార్వతీ అమ్మవారు ... గణపతి ... నాగదేవత ... వీరభద్రుడు పూజలు అందుకుంటూ వుంటారు. అటు ఆధ్యాత్మిక వైభవం ... ఇటు చారిత్రక నేపథ్యం కలిగిన ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి బాగానే వుంటుంది.
ఇక్కడి స్వామి అడిగినంతనే కరిగిపోయి కరుణిస్తూ ఉంటాడని భక్తులు చెబుతుంటారు. ఆయన అనుగ్రహంతో తాము సాధించిన వాటి గురించి అనుభవపూర్వకంగా వివరిస్తూ వుంటారు. మండలంపాటు స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినవారికి ఫలితం వెంటనే కనిపిస్తుందని అంటారు. విశేషమైన పర్వదినాల్లో ఆ స్వామిని మరింత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ తరిస్తుంటారు.