స్నాన నియమాలు

స్నాన నియమాలు
ఉదయం నిద్రలేవగానే స్నానంచేసి దేవుడికి పూజ చేసుకోవడమనేది మన ఆచారాల్లో ఒక భాగంగా తరతరాల నుంచి వస్తోంది. మన పూర్వీకులు స్నానానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు .. అందులోని పవిత్రతను చాటిచెప్పారు. ఈ నేపథ్యంలో వాళ్లు స్నాన సమయాలను నాలుగు రకాలుగా విభజించారు.

బ్రహ్మీ ముహూర్తంలో చేసే స్నానాన్ని దేవతా స్నానమనీ .. అరుణోదయ సమయంలో చేసేది రుషి స్నానమనీ .. సూర్యోదయంలో చేసేది మనుష్య స్నానమనీ .. సూర్యోదయం తరువాత చేసే స్నానం రాక్షస స్నానంగా చెప్పారు. ఇక బ్రహ్మచారులకు ఒకపూట స్నానం ... గృహస్తులకు రెండు పూటల స్నానం ... మునీశ్వరులకు మూడు పూటల స్నానం నియమంగా చేశారు.

అనుకోని కారణాల వలన పవిత్రతకు భంగం కలిగిన సమయాల్లో ఈ సంఖ్య పెరగడం వలన ఎలాంటి దోషం అంటదని చెప్పారు. అయితే ఉదయంవేళలో సూర్యకిరణాలు ... రాత్రి వేళలో చంద్రకిరణాలు పడిన నీటితోనే స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఎన్నిసార్లైనా స్నానమనేది సూర్యాస్తమయానికి ముందువరకు మాత్రమే చేయాలని అంటోంది. ఒక్క గ్రహణ సమయాల్లో తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడూ కూడా రాత్రి సమయాల్లో స్నానం చేయకూడదని స్పష్టం చేస్తోంది.

అనారోగ్య పరిస్థితులను బట్టి ... అత్యవసర పరిస్థితులను బట్టి ... వయసులను బట్టి ఈ విషయంలో కొంత సడలింపును ఇవ్వడం కూడా జరిగింది. ఇక అపవిత్రమైన ప్రదేశాలకి వెళ్లి వచ్చినప్పుడు, మైల గల కుటుంబ సభ్యులను పలకరించి వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే స్నానం చేయాలనీ, లేదంటే దోషం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఇక ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో పవిత్రతకు భంగం కలిగినప్పుడు, పరిసర ప్రాంతాల్లో నీళ్లులేని కారణంగా స్నానం చేసే అవకాశం లేకపోవచ్చు.

అలాంటి సందర్భాల్లో 'గోధూళి' మీదపడెలా చేసుకుని దానిని స్నానంగా భావించవచ్చని శాస్త్రం చెబుతోంది. లేదంటే విభూతిని తలపైన ... శరీరం పైన చల్లుకుని స్నానం చేసినట్టుగా అనుకోవడం వలన కూడా దోషం నివారించబడుతుందని శాస్త్రం చెబుతోంది. స్నానాలు ... వాటి సమయాలు ... నియమాలు పరిశీలించినప్పుడు, ప్రతి అంశం వెనుక దాగిన ఆరోగ్యపరమైన అనేక విషయాలు మనకి స్పష్టమవుతాయి.

More Bhakti Articles