శ్రీముఖలింగం

శ్రీముఖలింగం
మహాదేవుడు ఆవిర్భవించిన మహిమాన్వితమైనటువంటి పుణ్య క్షేత్రాలలో 'శ్రీముఖ లింగం' ఒకటి. శ్రీకాకుళానికి 35 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. 'శ్రీ ముఖలింగేశ్వర స్వామి'తో పాటు ఇక్కడ భీమేశ్వర ... సోమేశ్వర ఆలయాలు కొలువుదీరి కనిపిస్తాయి. శ్రీముఖ లింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగం రాయితో మలిచినది కాదు. 'ఇప్పచెట్టు' పడిపోగా దాని మొదలు లింగాకారంలోకి మారింది. ఆ చెట్టు మొదలు ముందుభాగం పరమ శివుడి ముఖాకృతిగా రూపుదాల్చడంతో, అది 'శ్రీ ముఖలింగం'గా ప్రసిద్ధి చెందింది.

ఇక సంస్కృతంలో 'ఇప్పచెట్టు'ను మధుకం అంటారు. అందువలన ఇక్కడి స్వామివారిని 'మధుకేశ్వర స్వామి'గా కూడా పిలుస్తూ వుంటారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు 'వారాహి దేవి'గా ఇక్కడ పూజలు అందుకుంటూ వుంటుంది. ఇక్కడ లభించిన శాసన ఆధారాలను బట్టి క్రీ.శ.10 వ శతాబ్దంలో ... శ్రీ ముఖ లింగేశ్వర స్వామికి కళింగ రాజైన 'కామార్ణవుడు' ఆలయం నిర్మించాడనీ, ఆయన కుమారుడు భీమవజ్ర హస్తుడు భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది.

విశేషమైనటు వంటి పర్వదినాల సమయంలో వారాహి సమేత శ్రీ ముఖ లింగేశ్వరస్వామిని పూజించి పునీతులు కావడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. విశాలమైన ఆలయ ప్రాంగణం మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తే, ఎత్తైన గోపుర నిర్మాణాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నిర్మాణాలు శిధిలావస్థకు చేరుకున్నప్పటికీ, ఆనాటి శిల్ప కళా వైభవానికి అద్దం పడుతూనే ఉన్నాయి.

More Bhakti Articles