దారి మళ్లించిన శివుడు

దారి మళ్లించిన శివుడు
శ్రీకాళహస్తి సమీపంలోని 'ఉడుమూరు' అనే గూడానికి సమీపంలో తన భార్యతో కలిసి 'తిన్నడు' (కన్నప్ప) నివసించసాగాడు. స్వశక్తిని తప్ప దైవాన్ని ఆయన అస్సలు విశ్వసించేవాడు కాదు. వివాహానికి ముందు నుంచి గౌరీదేవిని ఇలవేల్పుగా భావించే ఆయన భార్య, ఆయనను మార్చడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ వస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఓ శివరాత్రి రోజున వాళ్లిద్దరి మధ్యా మాటామాట పెరిగింది. శివుడి అనుగ్రహం లేకుండా ఆయనకి వేటలో ఏదీ దొరకదని ఆమె తేల్చి చెప్పగా, తన శక్తి సామర్థ్యాలతో ఏదో ఒకటి వేటాడి తెస్తానంటూ తిన్నడు విసురుగా అడవికి వెళ్లాడు. పక్షులను వేటాడే ప్రయత్నంలో ఆయన పైవస్త్రం గాలికి ఎగిరిపోయి శివాలయం ప్రాంగణంలో పడింది. గుడిలోకి వెళ్లడం ఇష్టం లేక తిన్నడు వెనుదిరిగాడు.

చీకటి పడుతున్నా ఆయన దేనినీ వేటాడలేకపోయాడు. దాంతో ఆకలి ... అహంభావంతో కూడిన ఆవేశం ఆయనలో చోటు చేసుకుంది. ఆయన కోసం భార్య ఆకలితో ఎదురుచూస్తూ కూర్చుంది. ఇది గమనించిన శివుడు, వివిధ రకాల ఫలాలు ... దినుసులు తీసుకుని మారువేషంలో తిన్నడి దగ్గరికి వెళ్లాడు. కాస్తంత ఎంగిలి పడమంటూ తిన్నడుకి ఎన్నో రకాలుగా చెప్పి చూశాడు. అయినా తిన్నడు వినిపించుకోక పోవడంతో, ఆయన ఇంటికి వెళ్లి భార్యకి నచ్చజెప్పి ఆ ఫలాలను ఆమెకి అందజేసి వెళ్లిపోయాడు.

భర్త తిరిగి రాలేదనే ఆందోళనతో వున్న ఆమె, వచ్చినది శివుడని గుర్తించలేకపోయింది. ఆయన ఇచ్చిన ఫలాలను తీసుకుని భర్తని వెదుక్కుంటూ అడవికి వెళ్లింది. ముందుగా ఆయనని కలిసిన వ్యక్తి, ఆ తరువాత తనని కలిసి ఫలాలు ఇచ్చినట్టుగా చెప్పింది. ఆ ఫలాలను మూటగట్టిన వస్త్రం, అంతకు ముందు గుడిలో ప్రాంగణంలో పడిపోయిన తన వస్త్రంగా తిన్నడు గుర్తించాడు. ఆ విషయం తెలుసుకున్న ఆయన భార్య, ఆ వచ్చినది శివుడేనని చెప్పింది. తమ ఇద్దరి మధ్య గొడవకి కారణం కూడా ఆ శివుడేనని చెప్పి ఆవేశంతో ఆ గుడిలోకి వెళ్లాడు తిన్నడు.

గర్భాలయంలోని శివలింగాన్ని ఆయన ఆవేశంతో తాకగానే ఆ సదాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కనిపించగానే తిన్నడిని అలుముకున్న అజ్ఞానాంధకారం ఒక్కసారిగా తొలగిపోయింది. ఆ క్షణం నుంచి తిన్నడు శివయ్యకి భక్తుడిగా మారిపోయాడు. అలా అప్పటివరకూ కండబలాన్ని నమ్ముకుని అహంభావంతో జీవిస్తోన్న తిన్నడిని,శివుడు ఆధ్యాత్మిక పథంవైపు మళ్లించి మోక్షాన్ని ప్రసాదించాడు.

More Bhakti Articles