శ్రీ కనకమహా లక్ష్మి

శ్రీ కనకమహా లక్ష్మి
భక్తులను అనుగ్రహించడానికి అమ్మవారు అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అవతరించింది. అలా అమ్మవారు కనకమహాలక్ష్మీగా ఆవిర్భవించిన క్షేత్రమే విశాఖపట్నం సమీపంలోని బురుజుపేట. అమ్మవారు పాదం మోపిన కారణంగా ఈ ప్రాంతం నేడు ప్రసిద్ధమైనటువంటి పుణ్య క్షేత్రంగా మారిపోయింది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించిన తీరును గురించి స్థానిక కథ ఒకటి ప్రచారంలో వుంది.

పూర్వం ఒక బ్రాహ్మణుడు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించి ఆయనను మోక్షం కోరాలనే ఉద్దేశంతో బయలుదేరాడు. అలా కొన్నిరోజుల పాటు ప్రయాణం చేసిన ఆ బ్రాహ్మణుడు అలసిపోయి ఒక బావి దగ్గర ఆగాడు. ఆ బావిలోని నీటితో దాహం తీర్చుకుని తిరిగి బయలుదేరుతుండగా, ఎవరో స్త్రీ పిలిచినట్టుగా అనిపించడంతో అటు ఇటు చూశాడు. ఆ శబ్దం వస్తున్నది బావి లోపలి నుంచి అని తెలుసుకుని ఆలకించాడు.

తాను కొన్ని కారణాల వలన చాలా కాలంగా బావిలో ఉన్నాననీ ... తనని బయటికి తీసి ప్రతిష్ఠించమని అమ్మవారు ఆ బ్రాహ్మణుడుని కోరింది. ఆమె కోరికను ఆ బ్రాహ్మణుడు సున్నితంగా తిరస్కరించాడు. తాను మోక్షాన్ని కోరి కాశీ వెళుతున్నాననీ, అందువలన ఈ కార్యాన్ని నిర్వహించేంతటి సమయం తనకిలేదని చెప్పాడు. దాంతో ఆగ్రహించిన అమ్మవారు తన చేతిలోని 'పరిఘ'అనే ఆయుధంతో అతణ్ణి దండించడానికి సిద్ధపడింది. తన భక్తుడి పరిస్థితిని గ్రహించిన శివుడు, వెంటనే అమ్మవారి ప్రయత్నానికి అడ్డుపడ్డాడు.

అమ్మవారి ఆవేశాన్ని శాంతింపజేసి ...ఆమె కనకమహాలక్ష్మీ రూపంలో ఆవిర్భవించే సమయం ఆసన్నమైందనీ ... ఆమెను బావి నుంచి వెలికి తీసి ప్రతిష్ఠించడం వలన కూడా అతనికి మోక్షం కలుగుతుందని శివుడు ఆ బ్రాహ్మణుడితో చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన అపరాధానికి మన్నించమని కోరుతూ అమ్మవారి ప్రతిమను బయటికి తీసి అక్కడే ప్రతిష్ఠించాడు. ఆ రోజు నుంచి అన్ని వర్గాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని విశేషమైన రీతిలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు.

ఇక మంత్ర సహితంగా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం కోసం, ఆ తరువాత కాలంలో అమ్మవారి మరో ప్రతిమను చేయించి శ్రీ చక్రంతో సహా ఒక మంటపంలో ప్రతిష్ఠించారు. ఇక్కడి అమ్మవారికి 'మార్గశిర మాసం'లో ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుపుతుంటారు. శ్రీ కనకమహాలక్ష్మీ దేవి సిరిసంపదలతో పాటు, కడుపు చలవను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ కారణంగా స్త్రీలు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు.

More Bhakti Articles