మహారాజ్ చూపిన మహిమ!

మహారాజ్ చూపిన మహిమ!
అక్కల్ కోట మహారాజ్ ఆ ప్రాంతానికి ఇంకా చేరుకోకముందు ఎక్కడెక్కడో తిరుగుతూ ... ఎక్కడపడితే అక్కడ సేదతీరుతూ ఉండేవాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపించేవాడు. అప్పటివరకూ ప్రశాంతంగా కనిపించిన ఆయన, ఒక్కసారిగా ఆగ్రహావేశాలను వ్యక్తం చేసేవాడు. ఈ విధంగా ఆయన ప్రవర్తించడం చూసిన వారంతా ఆయనని ఒక పిచ్చివాడుగా అనుకునేవారు.

కొంతమంది ఆయనపట్ల సానుభూతితో వ్యవహరిస్తే, మరికొంతమంది ఆయనకి దూరంగా వెళ్లేవారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన పిచ్చివాడు కాదనీ, ఆయన శక్తిసామర్థ్యాలు అంచనా వేయడం సామాన్యులకు సాధ్యం కాదనే సంఘటన ఒకటి జరిగింది. అక్కల్ కోట మహారాజ్ ఆకలి దప్పుల గురించి ఆలోచించేవాడు కాదు. అందువలన ఆయనపట్ల సానుభూతి కలిగినవారే, అందుకు తగిన ఏర్పాట్లు చేసేవారు.

ఈ నేపథ్యంలో ఓ బ్రాహ్మణుడు ఆయనను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. తీరా మహారాజ్ ఆ ఇంటికి వెళ్లేసరికి భోజనం ఇంకా సిద్ధం కాలేదు. అదే విషయాన్ని ఆ యజమాని కాస్త ఇబ్బంది పడుతూ మహారాజ్ తో చెప్పాడు. దాంతో మహారాజ్ అక్కడి అరుగుపై కూర్చుంటూ, కాస్త దూరంగా కట్టబడి వున్న ఆవుని చూశాడు. భోజనం గురించి అంతగా హైరానా పడవలసిన అవసరంలేదనీ, కాసిన్ని ఆవుపాలను ఇవ్వమని అడిగాడు.

ఆ మాటకు ఆ బ్రాహ్మణుడు కాస్తంత బాధపడుతూ, చాలాకాలంగా ఆ ఆవు ఈనలేదని చెప్పాడు. అది పాలు ఇవ్వని కారణంగా ఆయన కోరికని తాను మన్నిచలేకపోతున్నానని అన్నాడు. పాలు ఇస్తుందో .. లేదో ఒకసారి పితికి చూపించమని అన్నాడు మహారాజ్. తన మాటలు ఆయన నమ్మడంలేదని భావించిన ఆ బ్రాహ్మణుడు, నిజం ఆయనకి తెలియాలనే ఉద్దేశంతో ఓ గిన్నె తీసుకు వచ్చి పాలు పితికాడు. పితుకుతున్నా కొద్దీ పాలు ధారలుగా వస్తుండటంతో ఆయన ఆనందాశ్చర్యాలకి లోనయ్యాడు.

ముమ్మాటికీ అది మహారాజ్ మహిమగానే గ్రహించి, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన ద్వారా ఈ వింత గురించి తెలుసుకున్న వారంతా, ఆ ఆవును చూడటానికి వచ్చారు. ఆయన చెప్పినది నిజమేనని తెలుసుకుని, మహారాజ్ ని దైవ స్వరూపంగా భావించారు. ఆ రోజు నుంచి ఆయనను భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రారంభించారు.

More Bhakti Articles