వడాలి జగన్నాథుడు

వడాలి జగన్నాథుడు
పూరి జగన్నాథ స్వామిని దర్శించుకోలేని వాళ్లు ... వడాలి జగన్నాథ స్వామిని దర్శించుకోవచ్చు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని 'వడాలి'లో నిర్మితమైన ఈ దేవాలయం ... పూరీ జగన్నాథస్వామి ఆలయానికి నమూనాలా కనిపిస్తుంటుంది. ఇక గర్భాలయంలోని మూలవిరాట్టులను సైతం పూరీ నుంచి తీసుకు వచ్చి ప్రతిష్ఠించడం విశేషం.

ఇక ఈ దేవాలయం ఇక్కడ నిర్మించడానికి దారితీసిన పరిస్థితులు కూడా ఆసక్తి కరంగా ... ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటాయి. ప్రకాశం జిల్లా కర్రపాలానికి చెందిన పురుషోత్తమానంద అనే అవధూతకి జగన్నాథస్వామి కలలో కనిపించి, తన ఆలయాన్ని నిర్మించవలసిందిగా చెప్పాడు. దాంతో ఆయన అందుకు అనుకూలంగా వుండే స్థలాన్ని గురించి అన్వేషిస్తూ వడాలి ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి సువిశాలమైన స్థలం అందుకు అనుకూలంగా అనిపించడంతో దాని గురించి వాకబుచేసి అది నిజాం నవాబుదని తెలుసుకున్నాడు.

ఈ విషయాన్ని గురించి మాట్లాడటానికి వెంటనే నవాబును కలుసుకోవాలని భావించిన ఆయన, విజయవాడ కృష్ణా నదిలో మునిగి ... నిజాం నవాబు అంతఃపురంలో ప్రత్యక్షమయ్యాడు. విషయం తెలుసుకున్న నవాబు ... వడాలిలో సూర్యోదయం నుంచి అస్తమయం వరకూ ఎంత దూరం తిరిగితే అంత భూమి ఆలయ నిర్మాణానికి ఇస్తానని చెప్పాడట.దాంతో ఆ అవధూత ఆ సమయంలోగా 1200 ఎకరాలమేర తిరిగి ఆ స్థలం దేవాలయానికి దక్కేలా చేశాడు. ఆ రోజు నుంచి ఈనాటి వరకూ ఆలయం దిన దిన ప్రవర్ధమానమవుతూ దక్షిణ పూరీగా భక్తులతో పూజలు అందుకుంటోంది.

More Bhakti Articles