శిరిడీ సాయి దివ్య క్షేత్రం

శిరిడీ సాయి దివ్య క్షేత్రం
సకలమతాల సారం సఖ్యతనే ప్రభోదిస్తోందని చాటి చెప్పిన మహనీయుడు శ్రీ శిరిడీ సాయిబాబా. మూఢనమ్మకాలు ... మత ద్వేషాలు ఎక్కువగా వున్న ఆ కాలంలోనే ఆయన అందరికీ ఆదర్శంగా నిలవగలిగాడు. ప్రేమానురాగాలను ప్రతి ఒక్కరికి పంచుతూ అందరివాడినని అనిపించుకున్నాడు. తాను దేవుడినని సాయి ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. తాను చేసే సేవ వెనుక భగవంతుడి ఆదేశం ఉందనీ ... అనుగ్రహం ఉందని ఆయన చెప్పేవాడు.

భక్తులను ఆదుకోవడంలో సాయి క్షణమైనా ఆలస్యం చేయడు. అందుకే అంతా ఆయనని తమ సంరక్షకుడిగా భావిస్తుంటారు ... భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. అలా సాయి ఆరాధించబడుతోన్న మరో పుణ్యక్షేత్రం గుంటూరు జిల్లాలోని 'పేరే చర్ల'లో దర్శనమిస్తుంది. ఇక్కడి ఆలయం విశాలంగా ... ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. ఎత్తైన గోపురం ... పొడవైన ప్రాకారాలు ... వాటిపై వివిధ భంగిమలతో మలచబడిన సాయి ప్రతిమలు నయనమనోహరంగా దర్శనమిస్తాయి.

అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడిన ప్రధానమంటపంలోని వేదికపై సాయి కొలువై కనిపిస్తుంటాడు. భక్తులు కూడా సాయికి అభిషేకం చేసుకునే అవకాశం వుండటం ఇక్కడి విశేషం. అనునిత్యం ఇక్కడ సాయి పారాయణలు ... సాయి భజనలు ... నాలుగు హారతులు జరుగుతుంటాయి. ఇక గురువారం రోజున జరిగే సాయి 'పల్లకీ సేవ'లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఓ తండ్రిలా సాయి తన భక్తులను అక్కున చేర్చుకుంటూ వుంటే, ఓ బిడ్డలా సాయిని వాళ్లు కంటికి రెప్పలా చూసుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.

More Bhakti Articles