బొజ్జగణపయ్య క్షేత్రం

బొజ్జగణపయ్య క్షేత్రం
దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయన అనేక రూపాల్లో పూజలు అందుకుంటున్నాడని అంటారు. అయితే దేవుళ్ళందరిలోను ఎక్కువ రూపాల్లో దర్శనమిచ్చే దేవుడిగా వినాయకుడు కనిపిస్తుంటాడు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక పేరుతో ... ఏదో ఒక రూపంలో మనకి వినాయకుడు కనిపిస్తుంటాడు ... కరుణిస్తుంటాడు. వేల సంవత్సరాల వెనక్కి వెళితే అక్కడ కూడా గణపతి తారసపడి తప్పనిసరిగా పలకరిస్తాడు.

ఇటు పురాణ పరమైన అటు చారిత్రక పరమైన ఘనతను కలిగిన వినాయకుడు, అనేక ప్రదేశాల్లో స్వయంభువుగా ఆవిర్భవించి భక్తులచే నిత్య పూజలు అందుకుంటున్నాడు. అలాంటి నేపథ్యం గల క్షేత్రాల జాబితాలో మనకి సికింద్రాబాద్ కూడా దర్శనమిస్తుంది. ప్రస్తుతం ఆధునీకంగా కనిపించే ఈ ఆలయంలో కొలువుదీరిన గణపయ్య ఉనికి 18వ శతాబ్దం తొలినాళ్లలో బయటపడింది.

బ్రిటీష్ రెజిమెంట్ సిపాయిలకు ఓ పురాతనమైన బావిలో ఈ గణపతి విగ్రహం లభించింది. స్వయంభువుగా ఆవిర్భవించిన ఈ విగ్రహానికి అప్పట్లోనే ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. తరువాత కాలంలో ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. స్వామివారి మహత్తు కారణంగా ... భక్తులకు ఆయన పై గల విశ్వాసం కారణంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, తమని ముందుకు నడిపించేది ఈ స్వామియేనని నమ్ముతుంటారు.

ఆలయ ప్రాంగణంలో శ్రీ ఉమా మహేశ్వరుడు ... శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ... శ్రీ ఆంజనేయ స్వామి ... నవగ్రహాలు పూజలు అందుకుంటూ వుంటారు. వినాయక చవితి పండుగ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది.

More Bhakti Articles