ఏక వస్త్రంతో పూజ?

దేవుడిని పూజించడానికి కొన్ని పద్ధతులు వున్నాయి ... మరి కొన్ని నియమాలు వున్నాయి. పూర్వకాలం నుంచి వాటిని అనుసరిస్తూ వచ్చిన రుషులు, తమ శాస్త్రాల ద్వారా ఆయా విధానాలను సాధారణ మానవులకు అందించారు. నియమబద్ధమైన పూజ మంచి ఫలితాలను ఇస్తుందనీ, అసలు నియమమేలేని పూజ నిష్ప్రయోజనమని స్పష్టం చేశారు.

ఇక పూజకి సంబంధించిన నియమాల్లో 'ఏకవస్త్రం' ధరించి పూజ చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఉత్తరీయం (పై కండువ) లేకుండా కేవలం పంచ మాత్రమే ధరించి పూజలు చేయడం కానీ, నోములు - వ్రతాల్లో పాల్గొనడం గాని చేయకూడదని శాస్త్రం చెబుతోంది. పూర్వకాలంలో ప్రతి ఒక్కరికి భుజంపై కండువా వుండేది. ఆ కండువా భుజాన లేకుండా వాళ్లు భోజనానికి కూడా కూర్చునే వాళ్లు కాదు. తమకంటే పెద్దలు ఎదురైనప్పుడు భుజంపై గల ఆ కండువాను వెంటనే తీసి నడుముకి కట్టుకుని నమస్కరించేవాళ్లు. అయితే ఆనాటి పద్ధతులు ఈ రోజున ఆధునీకత పేరుతో అనేక మార్పులకు లోనయ్యాయి.

ఈ నేపథ్యంలో కొంతమంది పై కండువా లేకుండానే పూజలో కూర్చోవడం వంటివి చేస్తున్నారు. ఈ విధంగా ... శాస్త్ర విరుద్ధంగా పూజ చేయడం వలన పుణ్యం రాకపోగా దోషాలను మూటగట్టుకోవలసి వస్తుందని పెద్దలు చెబుతున్నారు. పెద్దలు సూచించిన శాస్త్ర సంబంధమైన నియమాలను పాటిస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడే దైవానుగ్రహం లభిస్తుందనే విషయాన్ని గ్రహించవలసిన అవసరం ఎంతైనా వుంది.


More Bhakti News