తోమాలసేవ

తోమాలసేవ
తిరుమల శ్రీవారి వైభవం చూసి తీరవలసిందే గానీ, వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆయనకి జరిగే అనేకమైన సేవలలో 'తోమాల సేవ'కి ఎంతో ప్రాధాన్యత వుంది. 'తోమాల' అనే మాట 'తోళ్ మాలై' అనే తమిళ పదం నుంచి పుట్టింది. 'తోళ్ మాలై' అనగా భుజాల మీదుగా ధరించిన మాల అని అర్థం. కాలక్రమంలో ఇది 'తోమాల' గా పిలవబడుతోంది.

ప్రతి గురువారం స్వామివారి ఆభరణాలకు బదులుగా వివిధ రకాల పూలమాలలను సర్వాంగ సుందరంగా అలంకరిస్తుంటారు. మూలమూర్తి భుజాల మీదుగా రెండు వైపులా పూలదండలను వ్రేలాడదీస్తారు. తోమాల సేవలో భాగంగా పూలమాలలతో స్వామివారి శంఖు చక్రాలను .. కంఠమును .. వక్షస్థలములోని శ్రీదేవి - భూదేవిలను .. నంద ఖడ్గమును .. సమస్త భువన భాండాలను పవిత్రం చేసే స్వామివారి పాదాలను అలంకరిస్తారు. స్వామివారికి సంబంధించి వివిధ భాగాలకు జరిగే పూల అలంకరణకు వివిధ పేర్లు వున్నాయి.

తోమాలసేవలో భాగంగా స్వామివారి శిరస్సు నుంచి భుజాల మీదుగా జాలువారుతున్నట్టు ఎనిమిది మూరల పూలమాలను అలంకరిస్తారు. ఈ పూలమాలను 'శిఖామణి' అని అంటారు. అలాగే స్వామివారి భుజాల నుంచి పాదాల వరకూ రెండు వైపులా అలంకరించబడిన నాలుగుమూరలుగల రెండు మాలలను 'సాలగ్రామమాల' అని అంటారు. శంఖు చక్రాలను అలంకరించబడిన ఒకటిన్నర మూర పొడవుగల రెండు మాలలను 'శంఖు చక్రమాల' అని అంటారు.

స్వామివారి కంఠప్రదేశంలో భుజాలను కలుపుతూ అలంకరించబడే మూడున్నర మూరలుగల పూలమాలను 'కంఠసరి మాల' అని అంటారు. ఇక స్వామివారి వక్షస్థలంలో గల శ్రీదేవి - భూదేవి మూర్తులకు అలంకరించబడిన ఒకటిన్నర మూర పొడవుగల రెండు పూలమాలలను 'వక్షస్థల మాల' లుగా పిలుస్తారు. స్వామివారి ఆయుధమైన 'నంద ఖడ్గము'నకు అలంకరించబడిన రెండు మూరలుగల పూలమాలను 'కఠారి సరిమాల' అని అంటారు. బ్రహ్మ దేవుడు కడిగిన పాదాలుగా చెప్పబడుతున్న స్వామివారి పాదాలను అలంకరించే రెండుమూరలుగల పూలమాలను 'తిరువడి మాల'గా పిలుస్తుంటారు.

ఇలా వివిధ రకాల పూలమాలలతో స్వామివారిని నయనమనోహరంగా అలంకరిస్తారు. గుత్తుగా ఆ మాలలను కట్టిన విధానం ... ఆ పూలలోని స్వచ్చత ... వాటితో ముస్తాబైన స్వామి వైభవం కళ్ళను కట్టిపడేస్తాయి. కాలం కరిగిపోతున్నా కళ్ళు ఆర్పకుండా అలా ఆయన సౌందర్యాన్ని చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. విశ్వంలోని వివిధ రకాల పూలు ఆయన కోసమే పూశాయనిపిస్తుంది ... ఆయనని ఆ అలంకరణలో ఒకసారి చూసిన తరువాత ఇక ఆ పూలలా రాలిపోయినా ఫరవాలేదనిపిస్తుంది.

More Bhakti Articles