మంగళమూర్తిగా మహాగణపతి
వినాయకుడు మహాశక్తిమంతుడు ... సమస్త శాస్త్రాల సారాన్ని గ్రహించినవాడు. ఆర్తితో ప్రార్ధిస్తే ఆదుకోవడంలో తండ్రిని మించిన తనయుడాయన. అలాంటి వినాయకుడు వివిధ రూపాలలో ... అనేక నామాలతో పూజలు అందుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా 'మంగళమూర్తి' అనే నామంతో వినాయకుడిని ఎక్కువగా పూజిస్తుంటారు.
గణపతిని మంగళమూర్తిగా ఆరాధించడం వెనుక పురాణ సంబంధమైన కథ ఒకటి వినిపిస్తూ వుంటుంది. పూర్వం అంగారకుడు (కుజగ్రహం) వినాయకుడి అనుగ్రహాన్ని కోరుతూ వేల సంవత్సరాలపాటు తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన వినాయకుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు. తనకి అమృతాన్ని ప్రసాదించవలసిందిగా కోరాడు అంగారకుడు. అందుకు అంగీకరించిన వినాయకుడు, ఇకపై 'మంగళుడు' అనే నామధేయంతో వర్ధిల్లమంటూ ఆశీర్వదించాడు.
సంతోషంతో ... సంతృప్తితో వెనుదిరిగిన అంగారకుడు నిరంతరం వినాయకుడిని స్మరిస్తూనే ఉండేవాడు. గణపతి పై గల భక్తి విశ్వాసాలతో ఆయనకి ఓ ఆలయాన్ని నిర్మించి పూజించసాగాడు. మంగళుడు పూజించిన మూర్తి కనుక ఆ స్వామి మంగళమూర్తిగా ప్రసిద్ధిచెందాడు. ఆనాటి నుంచి ఆ నామంతో గణపతిని ఆరాధించడం మొదలైంది. గణపతికి ... అంగారకుడికి మధ్యగల అనుబంధం కారణంగా, గణపతిని సేవించడం వలన కుజదోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
కృష్ణపక్షంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారంతో కూడిన చతుర్థిని 'అంగారక చతుర్థి'గా భావిస్తారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి వినాయకుడిని పూజించినట్టయితే, ఏడాది పొడవునా 'సంకష్టహర చతుర్థి' రోజున గణపతిని పూజించడం వలన కలిగే ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది.