త్రిపురాంతకం

త్రిపురాంతకం
శ్రీ శైల క్షేత్రానికి తూర్పు ద్వారమైన 'త్రిపురాంతకం'లో శివుడు ... త్రిపురాంతకుడిగా, పార్వతీ దేవి ... త్రిపుర సుందరీ దేవిగా భక్తులతో నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి 'కుమారగిరి'పై వెలసిన స్వామివారి ఆలయం నుంచి నైరుతి దిశగా చూస్తే ... కింది భాగంలో చెరువు ... దాని మధ్యలో కదంబ వృక్షాల మధ్య వెలసిన అమ్మవారి ఆలయం కనిపిస్తుంది.

గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తి కొన్ని వేల సంవత్సరాలనాటిదని చెబుతారు. ఇది తపో సంపన్నులకు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుందని అంటారు. గణపతి దేవుడి చెల్లెలు 'మైలాంబ' వేయించిన శాసనమును బట్టి ఈ ఆలయ నిర్మాణం 1209 లో జరిగిందనీ ... ప్రస్తుతం పూజలు అందుకుంటోన్న అమ్మవారి విగ్రహాన్ని ఆమే ప్రతిష్ఠింపజేసిందని స్పష్టమవుతోంది. ఈ అమ్మవారు రౌద్రమూర్తి గా కనిపించడమే కాకుండా, గతంలో ఇక్కడ జంతుబలులు విపరీతంగా జరిగేవనడానికి నిదర్శనాలు కనిపిస్తున్నాయి. విశేషమైనటువంటి పుణ్య దినాల్లో అమ్మవారు పులి ... సింహ ... గజ ... అశ్వ ... శేష ... నెమలి వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తుంటుంది.

ఈ క్షేత్రంలో వందకు పైగా శిలా శాసనాలు కనిపిస్తాయి. అయ్యవారికి ... అమ్మవారికి సంబంధించిన వివిధ సేవలకుగాను దాతలు సమర్పించిన వాటి వివరాలు ఈ దాన శాసనాల్లో కనిపిస్తుంటాయి. ఇక ఇక్కడి స్వామివారు మహా సత్యవంతుడనే విషయం మనకి 'బసవపురాణం'లో కనిపిస్తుంది. పూర్వం ఈ ఆలయం దగ్గర ఒక వ్యక్తి ఒక మూగ జీవిని రక్షించడం కోసం మరో వ్యక్తిని హత్య చేశాడు. అయితే అతని మాటలను ఆ గ్రామస్థులు నమ్మలేదు. అతను చెబుతున్నది నిజమేనంటూ స్వామివారి గర్భాలయం నుంచి వినిపించిందట. అందువల ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా భావించి భక్తులు విశేష సంఖ్యలో పూజలు జరుపుతుంటారు.

More Bhakti Articles