పంచబేరాలు

పంచబేరాలు
ప్రతి ఆలయంలోను మూలమూర్తితో పాటు ఉత్సవ మూర్తులు కొలువై వుంటాయి. మారుమూల గ్రామాల్లోని దేవాలయాల మొదలు, మహా పుణ్య క్షేత్రాల వరకూ తప్పనిసరిగా ఉత్సవమూర్తులు దర్శనమిస్తుంటాయి. ఉత్సవాల్లో పాల్గొనే మూర్తులు కనుక వీటిని ఉత్సవ మూర్తులని అంటూ వుంటారు.

సాధారణంగా ప్రతి మూర్తిని 'బేరం' అనే పేరుతో వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలో గర్భాలయంలోని మూలవిరాట్టును మూలబేరమని అంటూ వుంటారు. ఇక పంచలోహాలతో తయారు చేయబడిన వివిధ బేరాలు పుణ్య క్షేత్రాల్లో ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. వీటిని 'స్నపన బేరం' ... 'ఉత్సవ బేరం' ... 'బలిబేరం' ... 'శయనబేరం'గా పేర్కొంటారు.

సాధారణంగా మూలబేరానికి ప్రతినిత్యం అభిషేకం చేయడం వీలుపడదు కనుక, ఓ పంచలోహమూర్తికి అభిషేకాదులు నిర్వహిస్తారు. ఈ కారణంగా ఆ మూర్తిని స్నపన బేరమని పిలుస్తుంటారు. అలాగే ఉత్సవాల సమయంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేసే మూర్తిని ఉత్సవ బేరమని అంటారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో బలిహరణకు ఉపయోగించే మూర్తిని బలిబేరమని పేర్కొంటారు.

ఉదయం వేళలో వివిధ ఉత్సవాలు జరిగాక, రాత్రివేళలో స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తూ వుంటారు. ఈ సమయంలో ఉపయోగించే మూర్తిని శయన బేరమని అంటారు. ఇలా పంచబేరాలు సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తుంటాయి. భక్తిభావ పరిమళాలు వెదజల్లుతూ ఆధ్యాత్మిక పరమైన ఆనందాన్ని అందిస్తుంటాయి.

More Bhakti Articles