తిరునారాయణపురం

తిరునారాయణపురం
'తిరునారాయణపురం' 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా అలరారుతోంది. యాదవగిరి అనే పూర్వనామాన్ని కలిగి వున్న ఈ క్షేత్రం పరమ పవిత్రమైనదిగా ...మహా మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలోని స్వామివారికి యుగయుగాలనాటి చరిత్ర వుంది. కృతయుగంలో సనత్కుమారులు శ్రీమన్నారాయణుడి ప్రతిమను పుష్పక విమానంలో తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'నారాయణాద్రి' అనే పేరు వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక త్రేతాయుగంలో దత్తాత్రేయుడు వేదపురుషులతో కలిసి ఇక్కడ వేదాధ్యయనం చేయడం వలన ఈ క్షేత్రాన్ని 'వేదాద్రి'గా పిలుస్తుంటారు. అలాగే ద్వాపర యుగంలో యాదవాద్రిగా పూజలు అందుకున్న ఈ క్షేత్రం ... కలియుగంలో రామానుజాచార్యుల వారి కారణంగా 'యతిశైల' గా కొలవబడుతోంది. నృసింహస్వామి ... నారాయణస్వామితో పాటు ఇక్కడ శ్రీకృష్ణుడు భక్తులచే ఆరాధించబడుతున్నాడు.

అనేక తీర్థాలను కలిగి వున్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే, మనసు భక్తి భావాలతో నిండిపోతుంది. ఇక ఇక్కడ శ్రీ కృష్ణుడు కొలువై వుండటం వెనుక అందమైన ... యధార్థమైన కథ ఒకటి వినిపిస్తుంది. శ్రీ రామానుజాచార్యుల వారికి కలలో శ్రీ కృష్ణుడు కనిపించి, తాను ఢిల్లీ పాదుషా వారి అంతః పురంలో ఉన్నాననీ, తనని తిరునారాయణపురం క్షేత్రానికి చేర్చమని చెప్పాడట. దాంతో రామానుజాచార్యుల వారు ఢిల్లీ పాదుషా వారిని కలుసుకుని తాను వచ్చిన పని గురించి చెప్పాడు.

అయితే ఆ కృష్ణుడి ప్రతిమతో పాదుషా కూతురు మేల్కొట్టై అనుబంధాన్ని పెంచుకుంది. ఆ కారణంగా ఆమె ఆ ప్రతిమను రామానుజుల వారికి ఇవ్వడానికి నిరాకరించింది. కృష్ణుడు వస్తే తీసుకెళ్లమని ఆమె అనడంతో, రామానుజుల వారు అక్కడే కూర్చుని కృష్ణుడిని పిలిచారట. అంతే కృష్ణ విగ్రహం దానంతట అది వచ్చి రామానుజుల వారి ఒడిలోకి చేరింది. ఈ దృశ్యం చూసిన పాదుషా ఆ ప్రతిమను రామానుజుల వారికి అప్పగించారు. అయితే కృష్ణుడి యడబాటును భరించలేకపోయిన మేల్కొట్టై, స్వామిలో ఐక్యమైపోయింది. అందువలన ఈ క్షేత్రానికి మేల్కొట్టై అనే పేరుకూడా వుంది.

అలా రామానుజుల వారికి లభించిన కృష్ణ విగ్రహం ... ఉత్సవ మూర్తిగా ఇక్కడ దర్శనమిస్తుంది. ఎంతోమంది రాజులు ... మహా భక్తులు స్వామివారిని సేవించి తరించారు. కృష్ణా అని ఆర్తితో పిలిచినంతనే కష్టాలు కరిగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేయడం వలన సమస్త దోషాలు తొలగి పోతాయనీ, జ్ఞానం ... సంపద లభిస్తాయని అంటారు. విశేషమైన పుణ్య తిథుల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చూసితీరవలసిన దివ్య క్షేత్రం ఇదని చెప్పక తప్పదు

More Bhakti Articles