బాల ఈశ్వరాలయం

బాల ఈశ్వరాలయం
శ్రీ శైలానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో 'బాల ఈశ్వరాలయం' వుంది. కాలినడకన శ్రీ శైలానికి చేరుకునే వారు ముందుగా బాల ఈశ్వరుడిని దర్శించుకున్న తరువాతనే శ్రీ శైలానికి చేరుకుంటారు. ఇక్కడ బాల ఈశ్వరాలయం ఆవిర్భవించడానికి కారణమంటూ ఆసక్తికరమైన స్థానిక కథనం ఒకటి చెబుతుంటారు.

పూర్వం శ్రీ శైలం చేరుకోవడానికి కాలిబాట మినహా మరో మార్గం లేనప్పుడు, అక్కడికి చేరుకోవడానికి ముందు బాటసారులైన భక్తులు 'చింతల బయలు' అనే ప్రదేశంలో విశ్రాంతి తీసుకునేవారట. అక్కడే నివసించే ఓ చెంచుదొర, భక్తులకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవాడు. అతనికి శివయ్య అనే పదేళ్ల కొడుకు ... మల్లి అనే ఎనిమిదేళ్ల కూతురు వున్నారు. ప్రతి ఉదయం శ్రీ శైలం వెళ్లి మరుసటి ఉదయానికి స్వామివారికి కావలసిన బిల్వ పత్రాలను అర్చకులకు అందజేసి రాత్రికల్లా చెంచుదొర గూడెం చేరుకునేవాడు.

ఒకసారి పులి బారినుంచి తప్పించుకుని ఇంటికి ఆలస్యంగా వచ్చిన చెంచుదొర, పిల్లలు భయపడతారనే ఉద్దేశంతో ... దారిలో ఈశ్వరయ్య అనే పిల్లవాడు ఒంటరిగా కనిపిస్తే అతని తల్లిదండ్రులు వచ్చేంత వరకూ కబుర్లు చెప్పి వచ్చానని అబద్ధం చెప్పాడు. దాంతో ఆ రోజు నుంచి ఈశ్వరయ్యతో స్నేహం చేయాలని శివయ్య అనుకుంటూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో చెంచుదొర అనారోగ్యానికి గురికావడంతో, స్వామి సేవకి అవసరమైన బిల్వపత్రాలను తీసుకుని శ్రీశైలానికి బయలుదేరాడు శివయ్య.

తండ్రి చెప్పిన ప్రదేశానికి వచ్చి అక్కడ ఈశ్వరయ్య అనే పిల్లవాడు కనిపించక పోవడంతో పదే పదే బిగ్గరగా పిలిచాడు. ఎవరూ రాకపోవడంతో శివయ్యకి భయం పట్టుకుంది. దాంతో కరుణా రస సముద్రుడైన శివుడే బాలకుడిగా అక్కడికి వచ్చాడు. అతణ్ణి ఈశ్వరయ్యగా భావించిన శివయ్య ఆత్మీయంగా పలకరించి దగ్గరికి తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి శ్రీశైలం వెళ్లి బిల్వ పత్రాలను అందజేసి వస్తూ, ఎక్కడైతే కలుసుకున్నారో అక్కడే విడిపోయారు.

అలా కొంతకాలం గడిచింది ... ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. ఒక రోజున ఈశ్వరయ్య ... మరుసటి రోజుకి చెంచుదొర పూర్తిగా కోలుకుంటాడని శివయ్యతో చెప్పి ... చెంచుదొరకి ఇవ్వమంటూ ఒక శివలింగాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. జరిగింది తెలుసుకున్న చెంచుదొరకి అదంతా ఈశ్వరుడి లీల అని అర్థమైపోయింది. ఆ రాత్రి శివుడు అతని కలలో కనిపించి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. నేలను తాకగానే ఆ శివలింగం పెద్దది అవుతుందనీ ... దానిని దర్శించడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని చెప్పాడు.

గూడెం ప్రజలతో విషయం చెప్పి చెంచుదొర ఓ పవిత్రమైన ప్రదేశంలో దానిని ప్రతిష్ఠించాడు. ఆ రోజు నుంచి దీనిని గూడెం ప్రజలతో పాటు యాత్రికులు 'బాల ఈశ్వరాలయం'అని పిలవడం మొదలు పెట్టారు. ఇప్పటికీ శ్రీశైలం బయలుదేరిన వాళ్లు దారిలో వున్న ఈ ఆలయాన్ని ముందుగా దర్శించుకుని ఆ తరువాతే స్వామివారి సన్నిధికి వెళతారు.

More Bhakti Articles