ఉపమాక

ఉపమాక
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అంతటి విశిష్టతను సొంతం చేసుకున్న మరో పుణ్య క్షేత్రం ... 'ఉపమాక వేంకటేశ్వర క్షేత్రం'. విశాఖపట్నం ... నక్కపల్లి మండలం ... ఉపమాకలో ఈ క్షేత్రం భక్తుల పాలిట కొంగుబంగారమై అలరారుతోంది. గరుడపక్షిని పోలిన పర్వతంపై స్వామివారు కొలువుదీరి వుండటం వలన ఇక్కడి స్వామిని 'గరుడాచలేశ్వరుడు' గా పూజిస్తుంటారు.

ఇక్కడి స్వామివారు సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే దైవంగా ప్రసిద్ధి చెందాడు. గర్భాలయంలోని స్వామివారికి అభిషేకాదులు నిర్వహించిన అనంతరం, సంతానాన్ని కోరుకునే స్త్రీలు ధ్వజ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటూ వుంటారు. ఆలయానికి ఎదురుగా 'బంధుర' సరస్సు కనిపిస్తూ వుంటుంది. పూర్వం బ్రహ్మదేవుడు ఇక్కడ స్నానమాచరించడం వల్లనే ఈ సరస్సును ఈ పేరుతో మహర్షులు పిలిచేవారని చెబుతుంటారు.

క్రీ.శ.6 వ శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధీశులైన 'శ్రీ కృష్ణ భూపాలుడు' స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఆ తరువాత కాలంలో ఎందరో పుణ్యాత్ములు ఆలయ అభివృద్ధికి తమవంతు కృషిచేశారు. వివిధ క్షేత్రాలలో ఏడాదికి ఒకసారి లభించే ఉత్తరద్వార దర్శనం ... ఈ క్షేత్రంలో నిత్య వైకుంఠ ద్వార దర్శనంగా లభించడం విశేషంగా చెప్పబడుతోంది.

తిరుమల క్షేత్రంలో మాదిరిగానే ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు ... ఊరేగింపులు అత్యంత వైభవంగా జరుగుతూ వుంటాయి. ఉభయదేవేరులతో కలిసి తిరువీధుల్లో ఊరేగే స్వామివారిని దర్శించి తరించేందుకు భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు. తల నీలాలతో పాటు ధన .. కనక .. వస్తు వాహనాలను మొక్కుబళ్లుగా సమర్పించి సంతృప్తిని పొందుతుంటారు.

More Bhakti Articles