ప్రాణం పోసిన సిద్ధయ్య

ప్రాణం పోసిన సిద్ధయ్య
సిద్ధయ్య కారణజన్ముడనే విషయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి గ్రహించాడు. ఈ కారణంగానే ఆయన సిద్ధయ్యను తన శిష్యులలో ఉత్తముడిగా భావించాడు ... తన కుమారులకన్నా ఎక్కువగా అభిమానించాడు. వినయ విధేయతలకు ప్రతీకగా కనిపించే సిద్ధయ్య, తన గురువు అనుమతి ... ఆదేశం లేకుండా ఏ పనీచేసేవాడు కాదు. ఆయన ఆదేశించినది ఎంత కష్టమైనదైనా ఆలోచించేవాడు కాదు.

అలాంటి సిద్ధయ్య తన గురువు రాసిన కాలజ్ఞానాన్ని ప్రజలకు బోధిస్తూ వివిధ ప్రాంతాలను దర్శించసాగాడు. అలా ఆయన ఒక ఊరిలోకి అడుగు పెడుతుండగా, శ్మశాన భూమిలో ఏడుపులు వినిపించడంతో అటు వెళ్లాడు. చనిపోయిన వ్యక్తి శ్రీమంతుడనీ, పాముకాటు కారణంగా ఆయన మరణించాడని తెలుసుకున్నాడు. శవాన్ని ఉంచిన చితికి నిప్పు అంటించబోతుండగా సిద్దయ్య వారించాడు. అతనికి ఆయుష్షు ఇంకా తీరలేదనీ, అలాంటిది ఎలా దహన సంస్కారం జరిపిస్తారని అడిగాడు.

ఆ మాటలకి అక్కడ వున్న వారంతా బిత్తరపోయారు. కొందరు ఆయనను ఓ సాధారణ సాధువుగా భావించి వాదన వేసుకున్నారు. దాంతో సిద్దయ్య తన గురువును తలచుకుని శవం వైపు తీక్షణంగా చూశాడు. దాంతో శవంలా పడున్న వ్యక్తి నిదానంగా లేచి కూర్చున్నాడు. ఊహించని ఈ సంఘటనకి అంతా ఆశ్చర్యపోయారు. సజీవుడైన వ్యక్తి జరిగినదంతా తెలుసుకుని సిద్ధయ్య పాదాలకి నమస్కరించాడు.

ఆయనకి ప్రాణదానం చేసిన వ్యక్తి పేరు సిద్ధయ్య అనీ, వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడని తెలుసుకుని అక్కడున్న వారంతా ఆనందంతో పొంగిపోయారు. సిద్ధయ్యను తమ గ్రామానికి తీసుకువెళ్లి, అందరూ భక్తి ప్రపత్తులతో సేవించారు. ఆయన ద్వారా కాలజ్ఞానం గురించి తెలుసుకుని తరించారు.

More Bhakti Articles