నారాయణుడు వరుడైన నారాయణవనం

నారాయణుడు వరుడైన నారాయణవనం
శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీనివాసుడు ... పద్మావతీ దేవిని చూసి ఆమె సమ్మోహన సౌందర్యానికి ముగ్ధుడైన ప్రదేశమే 'నారాయణ వనం' ... ఇది తిరుపతి సమీపంలో వుంది. నారాయణుడు తిరుగాడిన ప్రదేశం కనుక నారాయణవనమనీ, ఆయన వరుడుగా మారిన ప్రదేశం కనుక నారాయణ వరమని పిలుస్తుంటారు. ఒకప్పుడు ఈ ప్రదేశం ఆకాశరాజు ఏలుబడిలో వుండేది. ఆకాశరాజు 'పుత్ర కామేష్టి' యాగంలో భాగంగా పొలం దున్నుతూ వుంటే, నాగలికి ఓ పెట్టె అడ్డుతగిలి ఆగిపోయింది. తవ్వి చూడగా ఆ పెట్టెలో ఒక ఆడ శిశువు కనిపించింది. ఆ శిశువుకి పద్మావతీ దేవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు.

యవ్వనంలోకి అడుగు పెట్టిన పద్మావతీ దేవి తన చెలికత్తెలతో ఆడుతూ ... పాడుతూ వుండగా ఓ ఏనుగును తరుముతూ శ్రీనివాసుడు అక్కడికి వచ్చాడు. పద్మావతి దేవిని చూసి మనసు పారేసుకుని, ఆమె గురించే ఆలోచిస్తూ 'తిరుమల' చేరుకున్నాడు. పద్మావతి గురించి తన మనసులోని మాటను 'వకుళమాత'కు చెప్పి, ఆమె ద్వారా ఆకాశరాజుని ఒప్పించాడు. అయితే వివాహానికి అవసరమైన ధనం కోసం, కుబేరుడి దగ్గర 14.14 కోట్ల రామ నిష్కములు (ఆనాటి ద్రవ్యం)అప్పుగా తీసుకుని ఇప్పటికీ దానికి వడ్డీని చెల్లిస్తున్నాడు. ఆ రోజున శ్రీనివాసుడు రాసిన రుణ పత్రాన్ని ఈ నాటికీ మనం వరాహస్వామి (తిరుమల) ఆలయంలో అర్చకులను అడిగి చూడవచ్చు.

నారాయణుడు ... పద్మావతిల వివాహం వైశాఖ మాసపు శుక్ల పక్ష దశమి(శుక్రవారం) రోజున జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆకాశరాజు ఇక్కడ ఓ దేవాలయాన్ని నిర్మించాడు. కాలాంతరంలో ఈ ఆలయాన్ని కార్వేటి రాజులు ... శ్రీకృష్ణ దేవరాయల వంశస్తులు అభివృద్ధి పరిచారు. ఈ ఆలయంలో వేంకటేశ్వరస్వామి వక్ష స్థలంలో లక్ష్మీదేవి వుండగా, ప్రాంగణంలో పద్మావతీ దేవి కొలువుదీరి కనిపిస్తుంది.

ఇక్కడి పారిజాత వృక్షం నారదుడు నాటినదిగా చెబుతారు. అమ్మవారికి 'నలుగు' పెట్టడానికి ఉపయోగించిన 'తిరగలి' ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తూ వుంటుంది. 'నారాయణ వనం'లో ప్రతియేడు వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఇక్కడి స్వామివారిని దర్శించుకుని ప్రదక్షిణాలు చేస్తే వెంటనే వివాహం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

More Bhakti Articles