పాండురంగ క్షేత్రం

పాండురంగ క్షేత్రం
పాండురంగ స్వామి క్షేత్రం అనగానే అందరికీ మాహారాష్ట్ర - పండరీపురం గుర్తుకు వస్త్తుంది. తుకారాం ... నామదేవుడు వంటి భక్తా గ్రేసరులు గుర్తుకు వస్తారు. మనసుతో మాత్రమే గెలవదగిన వాడైన ఆ పాండురంగడు ... కృష్ణా జిల్లా చిలకలపూడిలో సైతం వెలిశాడు. ఇక ఆనాడు పాండురంగని భక్తుడిగా తుకారం ఛత్రపతి శివాజీ ఎదుట అపూర్వమైన మహిమలు చూపగా, చిలకలపూడిలో 'నరసింహం' అనే భక్తుడు కూడా అదే రీతిలో తన భక్తి విశ్వాసాలను నిరూపించుకున్నాడు.

1905 లో చిలకలపూడి గ్రామానికి వచ్చిన నరసింహం ... జ్ఞానేశ్వర తుకారం మఠాన్ని స్థాపించి పాండురంగడి భజనలు జరుపుతూ ... అన్నసమారాధన నిర్వహిస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆయనకి పాండురంగ స్వామి కలలో కనిపించి తన కోసం దేవాలయాన్ని నిర్మిస్తే, తాను 'స్వయం భూ' గా ఆవిర్భావిస్తానని చెప్పాడట. దాంతో అతికష్టం మీద అందుకు అవసరమైన భూమిని సంపాదించి అయిదు ఎకరాల స్థలంలో 1929లో స్వామివారికి గుడి నిర్మించాడు.

గర్భాలయంలో ఆవిర్భవిస్తానన్న స్వామివారికి ఆహ్వానం పలుకుతూ ఆయన గర్భగుడి ఎదురుగా కూర్చుని ధ్యానం చేయసాగాడు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల ఊళ్ల నుంచి పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. ఇదంతా నాటకమని భావించిన బ్రిటీష్ అధికారులు, జనాన్ని నియంత్రించడం కోసం గర్భగుడికి తాళం వేశారు.

స్వామి తన కలలో కనిపించి చెప్పిన మాట నిజమనీ, స్వామి గర్భాలయంలో ఆవిర్భవించకపోతే తాను ఆయనలో ఐక్యమై పోతానంటూ నరసింహం అక్కడే భీష్మించుకు కూర్చున్నాడు. అంతలో పెద్ద శబ్దం రావడం ... తలుపులు వాటంతట అవే తెరుచుకోవడం జరిగిపోయాయి. దేదీప్యమానమైన కాంతి పుంజం మధ్యలో నుంచి వెలసిన పాండురంగ స్వామిని చూసి జనం సంతోషంతో పొంగిపోయారు. ఆ రోజు నుంచి స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ వుండటం మొదలు పెట్టారు.

ఆ రోజు నుంచి ఈనాటి వరకూ భక్తులు గర్భాలయంలోని స్వామి వారి పాదాలను స్వయంగా తాకి తరిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక శుద్ధ ఏకాదశి నుంచు పౌర్ణమి వరకూ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన పరమేశ్వరుడు ... కోరిన వరాలను అనుగ్రహిస్తూ 'సిద్ధేశ్వరుడు' గా భక్తుల హృదయాలను ఆక్రమించాడు. ఆ రకంగా ఇది శివకేశవుల క్షేత్రమై ... భక్తులపాలిట బధువై అలరారుతోంది.

More Bhakti Articles