కూర్మ పీఠ దర్శనం

కూర్మ పీఠ దర్శనం
దేవుడు సర్వాంతర్యామి ... ఈ సకల చరాచర సృష్టిలో ఆయనలేని ప్రదేశం లేదు. అన్నింటా ఆయన రూపాలే ... అంతటా ఆయన మహిమలే గోచరిస్తూ వుంటాయి. అడుగడుగునా ... అణువణువునా ఆయనే వున్నా, ఆలయానికి వెళ్లి ఆయన దర్శనం చేసుకుంటే గాని మనసుకి ఆనందం ... ఆహ్లాదం పుట్టవు.

ఉదయాన్నే ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకున్న తరువాతనే తమ దైనందిన జీవితాన్ని ఆరంభించే వారు ఇప్పటికీ లేకపోలేదు. ఆలయానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రధాన దైవం ... పరివార దేవతలు దర్శనమిస్తుంటారు. అలాగే అక్కడ 'తాబేలు ప్రతిమ' కూడా కనిపిస్తూ వుంటుంది. దీనినే 'కూర్మ పీఠం'అని అంటారు. కొన్ని ఆలయాల్లో ఇది మూలపీఠంగా ఏర్పాటు చేయబడుతుండగా, మరి కొన్ని ఆలయాల్లో స్వామివారికి ఎదురుగా ముఖమంటపంలో ఏర్పాటు చేస్తుంటారు.

క్షీరసాగర మథన సమయంలో శ్రీమన్నారాయణుడు కూర్మావతారాన్ని ధరించడం వల్లనే లోకాలన్నీ సకల సౌభాగ్యాలతో తులతూగుతున్నాయి. కూర్మావతారంలోనే స్వామి ఈ విశ్వమంతటిని మోస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి. కూర్మ పీఠం సమస్త లోకాలకు ఆధారపీఠం అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుని, ఆ రూపంలో గల స్వామిని దర్శించి .. సేవించి ... తరించాలనే ఉద్దేశంతోనే ఆలయాలన్నింటిలో కూర్మ పీఠాన్ని ఏర్పాటు చేస్తుంటారు.

ఈ కారణంగా ప్రధాన దైవమేదైనా ముందుగా కూర్మ పీఠాన్ని దర్శించడమనేది నియమంగా వస్తోంది. కూర్మ రూపాన్ని దర్శించడం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని ప్రత్యక్షంగా పూజించిన ఫలం లభిస్తుందనీ, సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

More Bhakti Articles