గంగను పొంగించిన వెంగమాంబ

గంగను పొంగించిన వెంగమాంబ
వేంకటేశ్వరస్వామిని తన భర్తగా భావిస్తూ అనుక్షణం ఆయన ధ్యానంలో కాలం గడుపుతోన్న 'వెంగమాంబ' తిరుమల చేరుకుంది. స్వామివారిని ఒకసారి దర్శించుకున్న ఆమె ఇక ఆయన ఎడబాటు కలగకూడదని నిర్ణయించుకుంది. వెంగమాంబను మహా భక్తురాలిగా భావించిన మఠాధిపతులు, తిరుమలలో ఆమె ఉండేందుకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

స్వామివారికి ఇష్టమైన తులసి మాలలను ప్రతినిత్యం సమర్పించాలని ఆమె నిర్ణయించుకుంది. అందుకోసం తులసి మొక్కలను విరివిగా పెంచాలని అనుకుంది. అందుకు అవసరమైన నీటి కోసం పాపనాశన తీర్థానికి వెళ్లే దారిలో ఆమె దిగుడు బావిని తవ్వించింది. అయితే అనుకోని విధంగా ఆ బావికి పెద్ద బండరాయి అడ్డుతగిలింది. విషయం తెలుసుకున్న వెంగమాంబ నిరాశ పడకుండా బావిలోకి దిగింది. ఆ బండరాయిని పూజించి ... గంగాదేవిని ప్రార్ధించి బావి పైకి వచ్చేసింది.

ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ ఆ బండరాయి దానంతట అది పగిలిపోయింది. అక్కడి నుంచి గలగల మంటూ గంగపొంగింది. ఈ దృశ్యం చూసిన వారంతా ఆమె దైవాంశ సంభూతురాలని గ్రహించారు. వెంగమాంబ ఇదంతా స్వామి అనుగ్రహంగా భావించి, ఆ నీటితో తులసి తోటను పెంచి అనునిత్యం తులసి మాలలను స్వామివారికి సమర్పిస్తూ వుండేది.

ఆ తులసి మాలలను ధరించిన శ్రీనివాసుడు మరింత తేజస్సుతో వెలిగిపోయేవాడు. స్వామివారి సౌందర్యాన్ని ... సంతోషాన్ని చూస్తూ వెంగమాంబ మురిసిపోయేది ... పరవశించిపోయేది. అప్పట్లో వెంగమాంబ తవ్వించిన బావిని ఇప్పుడు 'అమ్మవారి బావి' గా పిలుస్తుంటారు. ఇప్పటికీ తోటలకు ఈ నీటిని వాడుతూ వుండటం విశేషం.

More Bhakti Articles