చింతామణి క్షేత్రం

చింతామణి క్షేత్రం
కోరిన కోరికలను వెంటనే తీర్చే మణిని 'చింతామణి' అని అంటారు. ఈ ప్రదేశంలో అడుగుపెట్టినంతనే భక్తుల కోరికలు ఫలిస్తాయి కనుక ఈ క్షేత్రానికి 'చింతామణి' అనే పేరు వచ్చింది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో కొలువైవుంది.

హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో శివకేశవులతో పాటు, సత్యనారాయణ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడ శివుడు 'ఉమా మహేశ్వరుడు' గా ... శ్రీ మహావిష్ణువు 'వేంకటేశ్వరస్వామి' గా పూజలు అందుకుంటూ వుంటారు. శివుడు పార్వతీ సమేతుడై భక్తులను అనుగ్రహిస్తూ వుండగా, శ్రీ వేంకటేశ్వరుడు శ్రీదేవి - భూదేవి సమేతంగా దర్శనమిస్తుంటాడు.

ఇక సత్యనారాయణ స్వామితో పాటు గణపతి ... హనుమంతుడు ... సుబ్రహ్మణ్య స్వామి ... నవగ్రహాలు ఈ క్షేత్రంలో దర్శనమిస్తుంటాయి. రాజగోపురం ... ప్రాకారాలు ... ముఖ మంటపాలు ... పరివార దేవతా మందిరాలు అలనాటి ప్రాచీన వైభవాన్ని చాటి చెబుతుంటాయి. వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ క్షేత్రం శిధిలావస్థకు చేరుకోగా, గ్రామస్తులు ఆలయ పునఃనిర్మాణంలో పాలుపంచుకున్నారు.

ధర్మబద్ధమైన కార్యక్రమాలకు స్వామి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అనుగ్రహిస్తాడు కనుక, ఈ క్షేత్రం భక్తులతో నిత్యం రద్దీగానే వుంటుంది. వైశాఖ శుద్ధ పంచమి రోజున శివుడికి ... వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీనివాసుడికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. శివకేశవులను దర్శించుకుని వారి అనుగ్రహానికి పాత్రులవుతారు.

More Bhakti Articles