పెద్దమ్మ గుడి

పెద్దమ్మ గుడి
శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు దుష్ట శిక్షణ ... శిష్ట రక్షణ కోసం వివిధ రూపాలలో అనేక ప్రాంతాలలో అవతరించింది. అలా అమ్మవారు రాక్షస సంహారం అనంతరం సేదదీరిన ప్రదేశంగా హైదరాబాద్ - జూబ్లీహిల్స్ లోని 'పెద్దమ్మ గుడి' చెప్పబడుతోంది. ఇక్కడి అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాలకు దగ్గరగా వుండి గ్రామదేవతగా పూజలు అందుకుంటూ వుండేదట.

హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో, సహజంగానే పల్లెవాసాలు అదృశ్య మయ్యాయి. గ్రామదేవతగా వున్న అమ్మవారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతోంది. ఒక చెట్టుకింద చిన్న మందిరంలో వున్న అమ్మవారికి ఆలయం నిర్మించడంలోను ... అమ్మవారికి తగిన ప్రాచుర్యం కల్పించడం లోను పి.జనార్ధనరెడ్డి ప్రధానమైన పాత్రను పోషించాడు.

అందమైన రాజగోపురం ... ఎత్తైన ప్రాకారాలు ... తీర్చిదిద్దినట్టుగా కనిపించే ముఖమంటపం ... వరుసగా కొలువుదీరిన నవదుర్గలు ఆలయ వైభవానికి అద్దం పడుతుంటాయి. గర్భాలయంలో అమ్మవారు సింహ వాహనంపై కూర్చుని దర్శనమిస్తుంటుంది. ''అమ్మా'' అని ఆర్తితో పిలిచినంతనే మనసులోని భావాలను అర్థం చేసుకుని వరాలను ప్రసాదిస్తుందని భక్తులు చెబుతుంటారు.

అమ్మవారికి చెప్పుకోకుండా ఇక్కడి భక్తులు ఎలాంటి శుభాకార్యాలను ప్రారంభించరు. అమ్మవారి అనుగ్రహంతో శుభకార్యాలకు శ్రీకారంచుడితే తొలి ఆహ్వానం అమ్మవారికే అందుతుంది. ఇక్కడి భక్తులు అమ్మవారి పట్ల అంతటి ప్రేమానురాగాలను కలిగివుంటారు ... అపారమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

బ్రహ్మోత్సవాలు ... బోనాల ఉత్సవాలు ... శాకంబరి ఉత్సవాలు ... దసరా నవరాత్రులు ... శరన్నవరాత్రులు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. సాధారణ రోజుల్లో కూడా అమ్మవారి సన్నిధి భక్తజన సందోహంతో కళ కళలాడుతూ వుంటుంది. పర్వదినాల సమయంలో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా వుంటుంది. అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు జరిపించే భక్తులు, ఆమెకి ఇచ్చిన మా టమేరకు మొక్కుబడులు చెల్లించి వెళుతుంటారు.

More Bhakti Articles