లేపాక్షి

లేపాక్షి
అనంతపురం జిల్లాలో చూడదగిన క్షేత్రాలలో 'లేపాక్షి'ఒకటి. లేపాక్షి ... పేరు వినగానే అక్కడి బసవన్న విగ్రహం కళ్ల ముందు కదలాడుతుంది. వీరభద్రాలయం సమీపంలో 15 అడుగుల ఎత్తున ... 22 అడుగుల పొడవున కనిపించే ఈ నందీశ్వరుడి విగ్రహం ఆనందాశ్చర్యాలను కలిగించకమానదు. ఇక్కడ అగస్త్యుడు ప్రతిష్ఠించినట్టుగా చెప్పబడుతోన్న శివలింగం పాపనాశేశ్వరుడుగా పిలవబడుతోంది. 108 శైవ క్షేత్రాలలో లేపాక్షి ఒకటిగా చెబుతారు.

సీతాదేవిని అపహరించి ఆకాశ మార్గాన తీసుకువెళుతోన్న రావణాసురుడుని 'జటాయువు' అనే పక్షిరాజు అడ్డుకున్నది ఇక్కడేనని స్థల పురాణం చెబుతోంది. రావణుడితో పోరాడి నేలకూలిన జటాయువు, ఆ వెనుక వచ్చిన రామలక్ష్మణులకు రావణుడు వెళ్లిన దిశ గురించి వివరించింది. ఆ సమయంలోనే శ్రీ రామచంద్రుడు ఆప్యాయంగా ముందుకి వంగి ఆ పక్షిరాజును లేవదీయబోతూ ''లే పక్షి'' అన్నాడట. అప్పటి నుంచి ఈ మాటే ఈ ప్రాంతానికి పేరుగా మారిందని చెబుతారు.

ఇక చారిత్రక ఆధారాల విషయానికి వస్తే ... అప్పట్లో ఈ ప్రాంతం విజయనగర పరిపాలకుడైన అచ్యుత దేవరాయల అధీనంలో వుండేది. ప్రభుత్వ ఖజానాకు అధికారిగా 'విరూపన్నుడు' ఉండేవాడు. లేపాక్షి పురాణ విశిష్టతను గురించి తెలుసుకున్న ఆయన తన సోదరుడు వీరన్నతో కలిసి వీరభద్రస్వామి దేవాలయాన్ని ... కళ్యాణ మంటపాన్ని నిర్మించడం మొదలు పెట్టాడు. మహా శిల్పులతో పురాణ గాధలను ... పక్షులు ... జంతువుల చిత్రాలను ... రాతినిర్మాణాలపై చెక్కించాడు. ఆ శిల్ప సౌందర్యాన్ని చూడవలసిందేగాని మాటల్లో చెప్పలేం.

ఆలయ నిర్మాణం కోసం తన అనుమతి లేకుండా విరూపన్నుడు ప్రభుత్వ ఖజానాలోని సొమ్ము వాడినట్లు తెలిసి అచ్యుతరాయల ఆగ్రహానికి గురయ్యాడు. అందుకు శిక్షగా తన కళ్ళు పొడిపించమని రాజావారి ఆజ్ఞ అయిందని తెలుసుకున్న విరూపన్నుడు, అచ్యుత రాయలు మనసు మార్చుకునేలోగా తన కనుగుడ్లను తానే పెరికి వేసుకున్నాడు. ఈ విషయం అచ్యుతరాయలను సైతం ఎంతగానో కలచి వేసిందని అంటారు.

గుడ్డివాడై ఆ శిల్పాలను స్పర్శిస్తూ ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ చివరి శ్వాస వదిలేవరకూ విరూపన్నుడు అక్కడక్కడే తిరిగేవాడట. ఆయన కన్నులు పొడుచుకున్న ఆ ప్రదేశం కనిపించగానే మనసు కదిలిపోక మానదు. విరూపన్నుడు గుడ్డివాడైన కారణంగానే స్వామివారి కళ్యాణ మంటప నిర్మాణం మధ్యలోనే ఆగిపోయి, ఆనాటి సంఘటనకు సాక్షిగా నిలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది.

More Bhakti Articles