నందివెలుగు

నందివెలుగు
కాశీ నుంచి బయలుదేరిన 'అగస్త్య మహర్షి' ... నదీ తీరాలలోను ... పవిత్రమైన ప్రదేశాలలోనూ శివలింగాలను ప్రతిష్ఠించుకుంటూ వెళ్లాడు. అలా ఆయన ప్రతిష్ఠించిన శివలింగమే ఈ రోజున అగస్త్యేశ్వర క్షేత్రంగా అలరారుతోంది. మహోన్నతమైన ఈ పుణ్య క్షేత్రం తెనాలి సమీపంలోని 'నందివెలుగు'లో భక్తులను అనుగ్రహిస్తోంది. ఈ క్షేత్రానికి ఈ పేరు రావడానికి గల కారణమంటూ స్థానికంగా ఓ కథ ప్రచారంలో వుంది.

అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఈ శివలింగం కాలక్రమంలో అడవిలో గుప్తంగా ఉండిపోయింది. చాలా కాలం తరువాత శివభక్తుడైన చాళుక్య రాజు 'విష్ణు వర్ధనుడు' ఓ రోజున షికారుకి అడవీ ప్రాంతానికి వచ్చాడు. ప్రాచీన కాలంనాటి ఆ శివలింగం అప్పుడు అతని కంటపడింది. అక్కడి శివలింగానికి రత్నకిరణాలతో నిత్యార్చన జరిపించాలనే ఉద్దేశంతో ఆయన ఓ విచిత్రమైన పథక రచన చేశాడు.

అగస్త్యేశ్వర స్వామికి ఎదురుగా గల నందీశ్వరుడి కొమ్ములకు అమూల్యమైన రత్నాలను అమర్చి, వాటిపై పడిన కాంతి పరావర్తనం చెంది, ఆ కిరణాలు నేరుగా స్వామివారి పాదాలపై పడేలా చేశాడు. నంది వెలుగు వలన శివుడు కాంతివంతంగా కనిపించేవాడు. నంది కొమ్ములనుంచి వచ్చే కిరణాలతో స్వామివారికి నిత్యార్చన జరిగేది కాబట్టి ఈ ప్రదేశానికి 'నంది వెలుగు'అనే పేరు వచ్చిందని చెబుతారు.

ఈ ప్రచారంలో నిజానిజాల మాటెలా ఉన్నప్పటికీ, ఈ క్షేత్రం మహిమాన్వితమైనదనే మాట మాత్రం వాస్తవం. ఇక్కడ అగస్త్యేశ్వర స్వామితోపాటు ... పార్వతీ అమ్మవారు ... శ్రీ సత్యనారాయణ స్వామి ... నటరాజ స్వామి ... కాలభైరవుడు ... నవగ్రహాధిపతులు కొలువుదీరి కనిపిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో భక్తులు అశేష సంఖ్యలో ఇక్కడికి తరలివస్తూ తరిస్తుంటారు.

More Bhakti Articles