కాళ్లకూరు వేంకటేశ్వరుడు

కాళ్లకూరు వేంకటేశ్వరుడు
కలియుగదైవమైన శ్రీ వేంకటేశ్వరుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి,అనంతమైన తన మహిమలతో అశేష భక్త జనకోటిని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్వామివారి మహాత్మ్యాన్ని చాటి చెప్పే ఎన్నో కథలు ఆసక్తికరంగా వినిపిస్తూ వుంటాయి. అలాంటి ఓ అందమైన కథతో శ్రీ వేంకటేశ్వరుడు అవతరించిన క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా 'కాళ్లకూరు'లో కనిపిస్తుంది.

పూర్వం తిరుమల కొండపై శ్రీధరుడు అనే ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. అదే సమయంలో గంధర్వ కన్య అయిన పద్మావతి స్వామి వారి సన్నిధిలో వీణాగానం చేసేది. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన శ్రీధరుడు, తనని వివాహం చేసుకోవలసిందిగా ఆమెను ఇబ్బంది పెట్టాడు. అందుకు ఆమె అంగీకరించక పోవడంతో, నదిగా మారిపొమ్మని శపిస్తాడు. మరుజన్మలో కూడా అతను బ్రాహ్మణుడిగానే జన్మించి అష్టకష్టాలు పడవలసిందిగా ఆమె శపించింది. శాపవిమోచనం కోసం ఇద్దరూ స్వామివారిని ప్రార్ధించారు.

స్వామి ప్రత్యక్షమై ... పద్మావతి నదిగా మారిన తరువాత ఆ తీరంలో తాను వెలసిన ప్రతిమను శ్రీధరుడు ప్రతిష్ఠించడం వలన ఇద్దరికీ శాపవిమోచనం అవుతుందని చెబుతాడు. ఈ క్రమంలో వెలసిన స్వామి వారి విగ్రహం కాళ్ల వరకూ భూమిలోకి కూరుకుపోయి కనిపిస్తూ వుండటం వలన ఈ ప్రాంతానికి 'కాళ్లకూరు' అనే పేరు వచ్చింది. గర్భాలయంలో స్వామివారు ఏక శిలామూర్తిగా హృదయంలో లక్ష్మీ దేవితోను ... శిఖతోను దర్శనమిస్తుంటాడు. కుడి ఎడమల శ్రీదేవి ... భూదేవిలతో కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు.

ఇక ఈ క్షేత్రంలో స్వామివారి ప్రసాదాలుగా పొంగలి ... పులిహోర లభిస్తుంటాయి. ఈ ప్రసాదాలు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా, వీటిని స్వీకరించడం వలన భక్తుల కోరికలు నెరవేరతాయని చెబుతుంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి ... ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి రోజుల్లో స్వామివారికి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వెన్న - పాలు సేవించే ఆ వేంకటేశ్వరస్వామికి తమ విన్నపాలు తెలుపుకుని వెళుతుంటారు.

More Bhakti Articles