జమలాపురం

జమలాపురం
పవిత్రమైన మనసుతో ... నిర్మలమైన హృదయంతో పిలిస్తే దైవం పలుకుతుంది. తన భక్తులు తనని చూడటానికి రాలేని పరిస్థితుల్లో తానే వారి దగ్గరికి వెళ్లడం దైవానికి అలవాటే. ఈ రెండు విషయాలకు అద్దం పడుతోన్న పుణ్య క్షేత్రమే 'జమలాపురం'. ఖమ్మం జిల్లా జమలాపురం గ్రామంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రం ... 108 దివ్య తిరుపతులలో ఒకటిగా వెలుగొందుతోంది.

ఇక్కడ స్వయంభువుగా వెలసిన వేంకటేశ్వరుడు భక్తుల పాలిట బంధువుగా కొనియాడబడుతున్నాడు. ఈ క్షేత్రానికి పురాణ సంబంధమైన చరిత్ర వుంది ... పూర్వం ఇక్కడి సూచీ కొండపై 'జాబాలి మహర్షి' తపస్సు చేసుకునేవాడట. ఈ కారణంగానే ఈ ఊరును జాబాలపురమని పిలిచేవారు. కాలక్రమంలో అదికాస్తా జమలాపురంగా మారిపోయింది.

కాలక్రమంలో స్వామిని ఎందరో సేవిస్తూ తరించసాగారు ... వారిలో 'అక్కుభట్టు' ఒకడు. మహాభక్తుడైన అక్కుభట్టు స్వామిని నిరంతరం సేవిస్తూ ఉండేవాడు. స్వామి ఎడబాటుని ఆయన ఏ మాత్రం భరించలేకపోయేవాడు. అలాంటి అక్కుభట్టు స్వామిని కలుసుకుని, వయసు పెరిగిన మీదట కొండను ఎక్కలేక పోతున్నానంటూ స్వామినే కిందకి దిగిరమ్మని కోరాడు. అందుకు అంగీకరించిన స్వామి ఎలాంటి పరిస్థితుల్లోను వెనుదిరిగి చూడవద్దంటూ అతణ్ణి అనుసరించాడు.

పెద్ద కొండనుంచి ... చిన్న కొండకి దిగాక స్వామి వస్తున్నాడా ... లేదా ? అనే విషయం తెలుసుకోవడం కోసం అక్కుభట్టు వెనక్కితిరిగి చూశాడు. అంతే అక్కడ స్వామికి బదులుగా ఆయన 'పాదముద్ర' మాత్రమే కనిపించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఈ పాదాలనే భక్తులు విశేష సంఖ్యలో పూజిస్తున్నారు. పర్వదినాలలో స్వామివారికి ఇక్కడ విశేష పూజలను ... ఉత్సవాలని వైభవంగా నిర్వహిస్తూ వుంటారు.

More Bhakti Articles