ఉమామల్లేశ్వర క్షేత్రం

ఉమామల్లేశ్వర క్షేత్రం
'ఉమా' అంటూ అమ్మవారిని స్మరించినంత మాత్రానే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు పరమశివుడితో కలిసి వెలసిన పరమపావన క్షేత్రమే 'జొన్నాడ'. తూర్పు గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రం మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడి ఉమామల్లేశ్వరుడు అగస్త్య మహర్షి ప్రతిష్ఠితం కావడం వలన ఇది అత్యంత శక్తిమంతమైన క్షేత్రంగా చెప్పబడుతోంది. నారద మహర్షి ప్రతిష్ఠించిన నవ జనార్ధనస్వామి ఆలయాలలో ఒకటి ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ కారణంగానే ఇది హరిహర క్షేత్రంగా భక్తులచే పూజలు అందుకుంటోంది. ఎందరో రాజ వంశీకులు ఇక్కడి స్వామివారిని సేవించినట్టు స్థలపురాణం చెబుతోంది.

ఇక్కడి స్వామివారి వైభవాన్ని వీక్షించాలంటే, ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలో దర్శించవలసిందే. చైత్ర మాసంలో జరిగే స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఉమామల్లేశ్వరుడు వెన్నవంటి మనసున్నవాడనీ, భక్తి శ్రద్ధలతో వేడుకున్నదే తడవుగా కోరిన వరాలను ప్రసాదిస్తాడని స్థానికులు చెబుతుంటారు.

More Bhakti Articles