మహానంది

మహానంది
కర్నూలు జిల్లాలోని నంద్యాల సమీపంలో 'మహానంది' క్షేత్రం అలరారుతోంది. ఇక్కడి పరిసర ప్రాంతాల్లో 'నంది మండలం' అని చెప్పుకునే నవనందులు ప్రతిష్ఠించబడి వున్నాయి. 'ప్రధమ నంది' ... 'నాగనంది' ... 'వినాయక నంది' ... 'గరుడ నంది' ... 'శివనంది' ... ' విష్ణు నంది' ... 'సూర్య నంది' ... 'సోమనంది' ... 'మహానందిగా ఇవి ఆధ్యాత్మికతకు ఆనవాళ్లుగా నిలిచాయి.

నవనందులలో అత్యంత విశిష్టమైనదిగా మహానంది'ని గురించి చెబుతుంటారు. నవ నందులలో దేని ప్రత్యేకత దానిదే ... అన్నిటికీ కూడా నిత్య పూజలు జరుగుతూ వుంటాయి. ఇక మహానందికి ఏడాది పొడవునా భక్తుల తాకిడీ ఎక్కువగానే వుంటుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోగా నవనందులను దర్శించిన వారికి భూ ప్రదక్షిణ ఫలితం లభిస్తుందని అంటారు.

ఇక ప్రాచీన గాధను పరిశీలిస్తే ... మహా భక్తుడైన శిలాదుడికి శివుడు 'మహానందుడు' అనే పుత్రుడిని ప్రసాదించాడు. శివుడి అనుగ్రహం కారణంగా మహానందుడు లభించిన ఈ ప్రదేశానికి 'మాహానంది' అనే పేరు వచ్చింది. కొండల హృదయంలో మహానందేశ్వరుడు కొలువుదీరిన ఈ క్షేత్రంలో 'బ్రహ్మ గుండం' ... 'విష్ణు గుండం' ... 'రుద్ర గుండం' అనే నీటి ధారలు పవిత్రతకు అద్దం పడుతుంటాయి.

ఎంతో స్వచ్చంగా కనిపించే ఈ తీర్థజలాలు సాక్షాత్తు కైలాస పర్వతాలు కరగడం వలన వస్తున్నాయేమోనని అనిపించక మానదు. ఈ నీటి ధారలు భక్తులను పావనం చేస్తూ క్షేత్ర అవసరాలు తీర్చడమే కాకుండా, వ్యవసాయానికి కూడా సాగునీరుగా ఉపయోగించబడుతుండటం విశేషం. ఇక్కడి కామేశ్వరీ అమ్మవారి దేవాలయం ... శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం కూడా భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ వుంటాయి.

ఇలా కనుచూపుమేరలో ఎటు చూసినా కొండలు ... లోయలు ... జలపాతాలు ... వాటి ఒడిలో శివాలయాలు దర్శనమిస్తూ, భక్తులకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ వుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మహానంది ఓ ఆధ్యాత్మిక ప్రపంచం ... ప్రతి ఒక్కరు దర్శించి ... స్మరించి తరించవలసిన పరమపావనమైన ముక్తి క్షేత్రం.

More Bhakti Articles