నవరాత్రోత్సవ అలంకారాలు

నవరాత్రోత్సవ అలంకారాలు
శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు కొలువైన ప్రతి క్షేత్రంలోను నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. లోకకల్యాణం కోసం అమ్మవారు తొమ్మిది రోజుల్లో 'శైలపుత్రి' ... 'బ్రహ్మచారిణి' ... 'చంద్రఘంట' ... 'కూష్మాండ' ... 'స్కందమాత' ... 'కాత్యాయని' ... 'కాళరాత్రి' ... 'మహాగౌరి' ... 'సిద్ధిధాత్రి' అనే తొమ్మిది రూపాలను ధరించి, తొమ్మిది మంది రాక్షసులను సంహరించింది.

ఈ కారణంగా అమ్మవారిని ఆయా రూపాల్లో అలంకరించి పూజించడం ఆనవాయతీగా వస్తోంది. ఇక ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంలో అమ్మవారికి ఒక్కోరోజున అంటే తిథులను బట్టి పత్ర పుష్పాలతో అలంకరణ చేయాలని శాస్త్రం చెబుతోంది. 'పాడ్యమి' రోజున మల్లెలతో ... 'విదియ' రోజున జాజిపూలతో ... 'తదియ' రోజున సంపంగి పూలతో అమ్మవారిని అలంకరించాలి.

'చవితి' రోజున సన్నజాజి పూలతో ... 'పంచమి' రోజున పారిజాతాలతో ... 'షష్ఠి' రోజున మందార పూలతో అలంకరణ చేయాలి. ఇక 'సప్తమి' రోజున మొగలి పూలతో ... 'అష్టమి' రోజున గులాబీ పూలతో ... 'నవమి' రోజున మరువాలతో అలంకరణ చేయాలి. ఒకవేళ ఈ పూలు అందుబాటులో లేనట్టయితే, వివిధ పత్రాలతోను అమ్మవారికి అలంకరణ చేయవచ్చు.

మొదటి రోజున బిల్వ దళాలతోను ... రెండో రోజున తులసీ దళాలతోను ... మూడో రోజున మరువాలతో అలంకరణ చేయవచ్చు. అలాగే నాలుగో రోజున నేరేడు ఆకులతోను ... అయిదవ రోజున మూలుగు ఆకులతోను ... ఆరవ రోజున గంధపు ఆకులతోను అమ్మవారిని అలంకరించాలి. ఏడవ రోజున తుమ్మా కులతోను ... ఎనిమిదవ రోజున పన్నీరాకులతోను ... తొమ్మిదో రోజున దవనాలతోను అమ్మవారిని అలంకరించి పూజించాలి. ఈ తొమ్మిది రోజుల పాటు ఈ విధంగా అమ్మవారిని సేవించడం వలన అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని అంటారు.

More Bhakti Articles