ర్యాలి

ర్యాలి
తూర్పు గోదావరి జిల్లాలోని ప్రధానమైన పుణ్య క్షేత్రాలలో 'ర్యాలి'ఒకటి. రావులపాలెం సమీపంలోగల ఆత్రేయపురం మండలంలో ఈ పుణ్య క్షేత్రం దర్శనమిస్తుంది. 'శ్రీ జగన్మోహినీ కేశవస్వామి' కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం, చోళుల కాలంలో అభివృద్ధి చెందిందనడానికి ఆధారాలు వున్నాయి. ఇక్కడ మూలవిరాట్టుగా భావిస్తోన్న ఒకే శిలకి ముందువైపున నాలుగు భుజాలు గల 'కేశవ స్వామి' ... వెనుక భాగంలో వయ్యారంగా 'జగన్మోహిని' దర్శనమిస్తారు. ఇది స్వయంభువు అని 'శ్రీమత్భాగవతం'లో చెప్పబడింది. అయిదు అడుగుల ఎత్తుగల 'ఏకాండి సాలగ్రామ శిల' ప్రపంచంలో ఇదొక్కటేనని అంటారు.

ఇక ఈ క్షేత్ర ఆవిర్భవానికి కారణమైన పురాణగాధలోకి వెళితే ... సముద్ర మథనం ఫలితంగా వెలువడిన అమృతాన్ని సురులకు అందిస్తూ అసురులను పక్కదారి పట్టించడంలో విశ్వ మోహనుడైన కేశవుడు, జన్మోహినిగా ప్రధాన పాత్రను పోషించాడు. తన రూపలావణ్యా లతో అసురులను మంత్రముగ్ధులను చేసిన మోహిని, ముక్కంటి మనసును సైతం మురిపించింది. దాంతో మోహిని సౌందర్య మహిమకు వశుడైన శంకరుడు ఆమెను అనుసరించాడు. ఆయన వేగం చూసిన మోహిని అక్కడి నుంచి పరుగందుకుంది. అలా ఈశ్వరుడిని ఊరిస్తూ ఉడికిస్తోన్న జగన్మోహిని సిగలో నుంచి ఓ పువ్వు రాలిపడింది. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'ర్యాలి'అనే పేరు వచ్చిందని అంటారు.

ఈ ప్రదేశానికి చేరుకోగానే తనని పరవశుడిని చేసినది విష్ణుమాయ అనే విషయం శివుడికి అర్థమైంది. దాంతో విష్ణువు ... ఆయన మాయను తెలుసుకున్న శివుడు ఇద్దరూ కూడా ఇక్కడే వెలిశారు. ఇక్కడ కేశవస్వామి ఆలయం తూర్పు ముఖంగా వుంటే, శివాలయం పడమర ముఖంగా కనిపిస్తుంది. ఇక కేశవస్వామి రూపం మనోహరంగా కనిపిస్తూ ఉంటే, అశ్వనీజాతి స్త్రీ లక్షణాలతో మోహినీ రూపం కనులను కట్టి పడేస్తుంటుంది.

సాలగ్రామ ఏకశిల అయిన కేశవస్వామి పాదాల చెంతనుంచి నీరు అదే పనిగా ఊరుతుంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి ఎలా వస్తుందనేది పరిశోధనలకి అందని రహస్యంగానే మిగిలిపోయింది. మహిమాన్వితమైన ఈ పుణ్య క్షేత్రం ఆధ్యాత్మిక చింతనతో పాటు ... అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు.

More Bhakti Articles