గోవర్ధన క్షేత్రం

గోవర్ధన క్షేత్రం
దశావతారాలలో శ్రీకృష్ణావతారానికి ఎంతో ప్రాధాన్యత వుంది. కృష్ణుడి బాల్య క్రీడల నుంచి ఆయన అవతార పరిసమాప్తి వరకూ ప్రతి ఘట్టం ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. జగన్నాటక సూత్రధారి అనిపించుకున్న కృష్ణుడు, నిత్య చైతన్య మూర్తిలానే నాటి ప్రజలకు ... నేటి భక్తులకు దర్శనమిస్తూ వచ్చాడు. ఆయన ఏ పేరుతో ఎక్కడ ఆవిర్భవించినా భక్తులు సేవిస్తూ ... స్మరిస్తూ ... తరిస్తూనే వున్నారు.

అలా భక్తులచే పూజలందుకుంటూ వారి కొంగుబంగారంగా అలరారుతున్న కృష్ణుడు మనకు 'నాదెండ్ల' క్షేత్రంలోను దర్శనమిస్తుంటాడు. గుంటూరు జిల్లాలోని ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు కొండ పక్కనే కొలువుదీరి కనిపిస్తుంటాడు. ఈ కారణంగానే ఆయనను 'గోవర్ధనస్వామి' అని భక్తులు పిలుస్తుంటారు. శ్రీ కృష్ణుడు ఆవిర్భవించిన కారణంగానే ఈ ప్రాంతాన్ని పూర్వకాలంలో 'నందపురం' అని పిలిచేవారనీ, కాలక్రమంలో అది 'నాదెండ్ల' గా మారిందని అంటారు.

రుక్మిణీ ... సత్యభామ సమేతంగా స్వామివారు దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. ఈ ఆలయ అభివృద్ధిలో కొండవీటి రెడ్డిరాజులు ప్రధాన పాత్రను పోషించినట్టు ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడి కృష్ణుడిని దర్శించడం వలన కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. 'కృష్ణాష్టమి' సందర్భంగా ఇక్కడ జరిగే ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలోనే పాల్గొంటూ వుంటారు.

ఇక ఇక్కడ కృష్ణయ్యతో పాటు 'చెన్నకేశవ స్వామి' కూడా దర్శనమిస్తుంటాడు. గర్భాలయంలో శ్రీదేవి - భూదేవి సమేతంగా స్వామి కొలువై వుంటాడు. 'ముక్కోటి ఏకాదశి' సందర్భంగా ఇక్కడ విశేష పూజలను నిర్వహిస్తుంటారు. ఈ రోజున ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. ఈ ఆలయాలు తరాలవారీగా తమకి లభించిన తరగని సంపదగా స్థానికులు భావిస్తుంటారు. అనునిత్యం స్వామి అనుగ్రహాన్ని కోరుతూ ఆరాధిస్తుంటారు.

More Bhakti Articles