ఒంటిమిట్ట

ఒంటిమిట్ట
సీతారాములు వెలసిన పుణ్యక్షేత్రాలలో కడప జిల్లాకు చెందిన 'ఒంటిమిట్ట' పుణ్యక్షేత్రం ఒకటి. ఇక్కడ సీతా ... లక్ష్మణ సమేతంగా వెలసిన శ్రీరామచంద్రుడు దర్శనమిస్తాడు. అయితే ఇక్కడ హనుమంతుడు కనిపించక పోవడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఈ క్షేత్రం ఆవిర్భవించే నాటికి సీతారాములకు హనుమంతుడు పరిచయం కాకపోవడమే అందుకు కారణమని చెబుతూ వుంటారు.

సీతారాముల కల్యాణం జరిగిన తరువాత, తమ తపస్సుకు అంతరాయం కలిగిస్తోన్న దుష్టులను శిక్షించ వలసిందిగా 'మృకండ మహర్షి' కోరడంతో సీతా లక్షణ సమేతంగా శ్రీ రాముడు ఆయనతో వెళ్లి యాగరక్షణ చేశాడు. ఆ ప్రదేశమే నేడు 'ఒంటిమిట్ట'గా పిలవబడుతోంది. శ్రీ రాముడు అందించిన సాయానికి కృతజ్ఞతగా మహర్షులు వారి మూర్తులను ఏకశిలపై చెక్కించగా ... జాంబవంతుడు వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు చెబుతారు.

ఇక్కడి శిల్ప కళా సౌందర్యం ఎంతటివారినైనా ఆశ్చర్య చకితులను చేస్తుంది. అప్పట్లో రామలక్ష్మణులు తమ బాణాలతో పొంగించిన 'గంగ' ఇప్పటికీ అక్కడి ప్రజల దాహార్తిని తీరుస్తోంది. 1640 ప్రాంతంలో 'కడప'ని పాలించిన అబ్దుల్ నభీ ఖాన్ ... కోదండ రామస్వామి మహిమను పరీక్షించడం కోసం మూడు సార్లు పిలిస్తే, మూడు సార్లు కూడా రాముడు పలికాడట. ఆ రోజు నుంచి ఆయన కూడా రాముడి భక్తుడై చివరి వరకూ ఆయన సేవలోనే గడిపాడని అంటారు.

ఇక 'పోతన' ... 'అన్నమయ్య' ... 'వీర బ్రహ్మేంద్ర స్వామి' తదితరులు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్టుగా ఆధారాలు వున్నాయి. పోతన తన భాగవతాన్ని ఈ కోదండ రాముడికే అంకితం చేయగా ... అన్నమయ్య కూడా ఈ కోదండ రాముడిపై ఎన్నో కీర్తనలు రాశాడు. ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ రాముడిని దర్శించిన తరువాతే 'కాలజ్ఞానం' రాశాడట. ఇంతటి ఆధ్యాత్మిక చరిత్రను కలిగివున్న ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకోవడం కన్నా ధన్యత ఏముంటుంది?

More Bhakti Articles