తిరుమల క్షేత్ర పాలకుడు

తిరుమల క్షేత్ర పాలకుడు
సాధారణంగా వైష్ణవ క్షేత్రాలకు శివుడు ... శైవ క్షేత్రాలకు విష్ణువు క్షేత్రపాలకులుగా వ్యవహరిస్తుంటారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల క్షేత్రంలో శివుడు క్షేత్రపాలకుడిగా వున్నాడు. ఈ స్వామియే తిరుమల క్షేత్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అలాంటి క్షేత్ర పాలకుడైన శివుడు తిరుమల ప్రధాన గర్భాలయం ఎదురుగా గల ధ్వజస్తంభం దగ్గర శిలగా అంశ రూపంలోనూ ... ప్రస్తుతం 'గోగర్భ క్షేత్రం' గా పిలవబడుతోన్న 'పాండవతీర్థం' దగ్గర పూర్ణ స్వరూపంతోను భక్తులకు దర్శనమిస్తున్నాడు.

అయితే క్షేత్ర పాలకుడైన శివుడు ఇలా శిలా రూపంలో రెండు ప్రదేశాల్లో ఉండటానికి కారణం లేకపోలేదు. క్షేత్ర పాలకుడైన శివుడు పూర్వం 'రాతి గుండు' రూపంలో రాత్రి వేళలో శ్రీవారి ఆలయం చుట్టూ తిరిగేవాడట. పూజారులు ఉదయం వేళలో ఆలయం తలుపులు తీసేటప్పుడు ... రాత్రి వేళలో తలుపులు వేసేటప్పుడు తప్పనిసరిగా క్షేత్రపాలక శిలకి తాళాలు తాకించి ఆయన అనుమతి లభించినట్టుగా భావించి ఆ పనులు చేసేవారు. ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ వున్నది అంశావతారం మాత్రమే.

ఒకసారి పూర్ణశిల (రాతి గుండు) రాత్రి సమయంలో ఆలయం చుట్టూ తిరుగుతూ వుండగా, ఒక చిన్న పిల్లవాడు ప్రమాదానికి గురయ్యాడట. అప్పటి నుంచి క్షేత్ర పాలక శిల అంశావతారాన్ని మాత్రమే ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గర వుంచి, పూర్ణ స్వరూపాన్ని గోగర్భం (పాండవతీర్థం) దగ్గర ఉంచారు. ప్రతి యేటా 'మహా శివరాత్రి' పర్వదిన సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి పాండవ తీర్థానికి చేరుకున్న పూజారులు, క్షేత్ర పాలక శిలకి వెండి ఆభరణాలతో రూపురేఖలు కల్పించి 'ఏకాదశ రుద్రాభిషేకం' చేస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి వడపప్పు - పానకం నైవేద్యంగా సమర్పించి, వాటిని ప్రసాదంగా అక్కడి భక్తులకు పంచుతారు. స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని వీక్షించిన వారికి మోక్షం లభిస్తుందని చెబుతుంటారు.

More Bhakti Articles