యోగ నందీశ్వర క్షేత్రం

యోగ నందీశ్వర క్షేత్రం
శివుడు లోక కళ్యాణ కారకుడు ... భక్తజన ప్రేమికుడు. అష్టైశ్వర్యాలకు దూరంగా తిరుగాడే ఆయన భక్తులకు ప్రసాదించేదేముంటుందని కొందరు అనుకుంటూ వుంటారు. నిజం చెప్పాలంటే అసలు ఐశ్వర్య కారకుడు ఆయనే. మోక్షమైనా ... ఆనందాలపై ఆపేక్ష అయినా ... ఎవరేది కోరితే అదే ఆయన అనుగ్రహిస్తాడు. కరుణించడంలోను ... కాపాడటంలోను కన్న వాళ్లకన్నా ముందే వుండేది ఒక్క శివుడు మాత్రమే.

అలాంటి భక్త జన బాంధవుడు వెలసిన పరమ పవిత్రమైన క్షేత్రమే 'శ్రీ యోగ నందీశ్వర స్వామి' క్షేత్రం. బెంగుళూరు - బళ్లారి రోడ్డు మార్గంలో తారసపడే 'నంది హిల్స్' పై స్వామివారు 'యోగ నందీశ్వరుడు' పేరుతో కొలువుదీరి కన్పిస్తాడు. ఇక్కడ అమ్మవారు 'ముక్తాంబ' పేరుతో పూజలు అందుకుంటూ వుంటుంది. కొండపైకి చేరుకునే మార్గంలో భారీ బసవేశ్వరుడు దర్శనమిస్తాడు. భక్తితో ఆయనకి నమస్కరించుకుని కొండపైకి చేరుకోవాలి.

గర్భాలయంలోని శివలింగం పరిమాణ రీత్యా చిన్నదే అయినప్పటికీ, అటు చారిత్రక వైభవాన్ని ... ఇటు ఆధ్యాత్మిక సంపదను కలిగివుంది. 11 వ శతాబ్దం నుంచి ఇక్కడి స్వామివారిని వివిధ రాజ వంశాలకు చెందిన రాజులు సేవించి తరించారు. ఆలయ అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించారు. అప్పట్లో వారు చేపట్టిన రాతి నిర్మాణాలు ఈనాటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తుంటాయి.

విశాలమైన కోనేరు ... ఆనాటి రాజుల విశాలమైన మనసుకు అద్దం పడుతుంటుంది. ప్రకృతి ఒడిలో ఊయలలూగుతోన్న ఇక్కడి స్వామివారికి 'మహాశివరాత్రి' పర్వదినాన ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.

More Bhakti Articles