కోటిపల్లి

కోటిపల్లి
రాజమండ్రి సమీపంలో వెలసిన 'కోటిపల్లి' క్షేత్రానికి ఎంతో విశిష్టత వుంది. బలి చక్రవర్తి బారి నుంచి దేవతలను కాపాడిన తరువాత శ్రీ మహావిష్ణువు ఇక్కడే ధ్యానం చేసుకున్నాడు. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు ఆయనను దర్శించుకుని తరించారు. పవిత్రమైనటువంటి ఆ ప్రదేశంలోనే 'శ్రీ సిద్ధి జనార్ధనస్వామి'ని కశ్యపుడు ప్రతిష్ఠించాడు.

ఆ తరువాత కాలంలో అహల్యను మోహించిన దేవేంద్రుడుని సహస్ర యోనులతో సంచరించమని గౌతమ మహర్షి శపించాడు. ఆ శాపం నుంచి బయటపడే మార్గాన్ని చెప్పమని ఇంద్రుడు ప్రాధేయపడటంతో, కోటిపల్లి క్షేత్రంలోని జనార్ధనస్వామిని దర్శించి, కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. దాంతో కోటిపల్లి చేరుకొన్న ఇంద్రుడు కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. ఫలితంగా ఆయన శరీరంపై ఏర్పడిన సహస్ర యోనులు ... సహస్ర నేత్రాలుగా మారిపోయాయి.

ఇక గురువు భార్యను మోహించిన కారణంగా చంద్రుడు కూడా తన సహజ సిద్ధమైన వెలుగును కోల్పోయి వ్యాధి గ్రస్తుడయ్యాడు. పాపపరిహారాన్ని సూచించమంటూ శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. కోటిపల్లి క్షేత్రాన్ని దర్శించి పార్వతీ సమేత శివలింగాన్ని ప్రతిష్ఠించి కోటి బిల్వదళాలతో పూజించమని సెలవిచ్చాడు జనార్ధనుడు. ఆయన చెప్పినట్టుగానే చేసి చంద్రుడు పూర్వ వైభవాన్ని పొందాడు.

చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగానే ఇక్కడి శివయ్యని సోమేశ్వరుడనీ ... ఈ క్షేత్రాన్ని 'సోమతీర్థం' అని పిలుస్తుంటారు. ఇలా శివకేశవులు కొలువుదీరినందు వలన ... దేవాది దేవతల పాద స్పర్శ సోకిన కారణంగా ఈ క్షేత్రం మహా పవిత్రమైంది. మూడుకోట్ల శివలింగాలను ప్రతిష్ఠించడం వలన లభించే పుణ్యం ... ఈ దివ్య క్షేత్రంలో ఒకసారి స్నానం ఆచరించడం వలన లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

More Bhakti Articles