నిజమైన గురుభక్తి

నిజమైన గురుభక్తి
మహర్షులను ... మతా చార్యులను ... పీఠాధిపతుల జీవితాలను పరిశీలిస్తే, శిష్యులు వారిని దైవంగా భావించి సేవించారనే విషయం స్పష్టమవుతుంది. గురువు కోసం ఎన్నో త్యాగాలకు పాల్పడిన శిష్యులు శంకరాచార్యుల వారి శిష్య బృందంలోను ... రాఘవేంద్ర స్వామి శిష్య బృందంలోను ... అలాగే రామానుజాచార్యుల వారి శిష్య బృందంలోను కనిపిస్తారు.

ఏ మాత్రం సంకోచమనేది లేకుండా తమ గురువు కోసం త్యాగాలు చేసిన కారణంగానే, గురువులతో పాటు వారి ప్రియ శిష్యులకి కూడా చరిత్రలో చెరగని స్థానం లభించింది. అలాంటి వారిలో రామానుజాచార్యుల వారి శిష్యుడైన 'కూరుత్తాళ్వార్' ముందువరుసలో కనిపిస్తాడు. విష్ణు భక్తుడైన రామానుజాచార్యుల వారికి ఒకసారి చోళ ప్రభువు దగ్గర నుంచి కబురు వచ్చింది. తనతో సిద్ధాంత పరమైన చర్చ చేయవలసిందిగా ఆయన పంపిన వర్తమానం, రామానుజాచార్యుల వారి శిష్యుడైన కూరుత్తాళ్వార్ కి చేరింది.

చోళ రాజు వైష్ణవ ద్వేషి కావడంతో, ఆయన కారణంగా గురువు ప్రమాదంలో పడే అవకాశముందని కూరుత్తాళ్వార్ భావించాడు. అందువలన రామానుజాచార్యులను వారించి ఆయన పేరుతో ... ఆయన వేషధారణలో కూరుత్తాళ్వార్ చోళ రాజును కలుసుకుని సిద్ధాంత చర్చలో పాల్గొన్నాడు. అతని వాదనని అంగీకరించని రాజు ఆగ్రహావేశాలకులోనై, అతని రెండు కళ్ళును పెకిలించమని భటులను ఆదేశించాడు. అయినా కూరుత్తాళ్వార్ తాను రామానుజాచార్యులను కాదని చెప్పడం గానీ, సిద్ధాంత పరమైన తన వాదనని వెనక్కి తీసుకోవడం గాని చేయలేదు.

దాంతో రాజు ఆదేశం మేరకు భటులు ఆయనను అంధుడిని చేశారు. ఈ విషయం తెలిసి రామానుజాచార్యులు తల్లడిల్లిపోయారు. లోకానికి వెలుగును చూపే అతని కోసం చూపు పోగొట్టుకోవడం తనకి సంతోషంగానే వుందని ఆయననే కూరుత్తాళ్వార్ ఓదార్చారట. నిజమైన గురుభక్తి అంటే అతనిదేనని ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు.

More Bhakti Articles