చెన్నకేశవ క్షేత్రం

చెన్నకేశవ క్షేత్రం
రాక్షసుల ఆగడాల వలన మహర్షులకు తపోభంగం కలుగుతుండటంతో, వారి ఆవేదనను అర్థం చేసుకున్న శ్రీమహావిష్ణువు 'చెన్నకేశవ స్వామి'గా అవతరించాడు. తన అవతార కార్యం నెరవేరిన తరువాత ఇదే అవతారంలో స్వామి అనేక ప్రదేశాల్లో కొలువుదీరాడు. అలా స్వామి నెలవైన తొలి చెన్నకేశవ క్షేత్రమే 'మార్కాపురం'.

ప్రకాశం జిల్లాలో ఆవిర్భవించిన ఈ క్షేత్రానికి యుగయుగాలనాటి చరిత్ర వుంది. కృతయుగం నాటికి ముందు నుంచే ఇక్కడ ఈ స్వామివారు వెలసినట్టు ఆధారాలు వున్నాయి. ఇందుకు గర్భాలయంలోని స్వామి ' మకరతోరణం' నిదర్శనంగా నిలుస్తోంది. కృతయుగంలో 'గజారణ్యం' ... త్రేతాయుగంలో 'మాధవీపురం' ... ద్వాపర యుగంలో 'స్వర్గపురి' గా పిలవబడిన ఈ క్షేత్రం, కలియుగంలో 'మార్కాపురం' గా ప్రసిద్ధి చెందింది.

గర్భాలయంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామితో పాటు, మార్కండేయ మహర్షి ... మారిక - మారకలనే భక్తుల విగ్రహాలు కూడా దర్శనమిస్తుంటాయి. పల్లవులు ... విజయనగర రాజులు ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్టు ఆధారాలు వున్నాయి. వారు చేపట్టిన ఆలయ నిర్మాణాలు నాటి వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. 'శబ్దభేరి' విద్యను ఉపయోగించి ఇద్దరు అన్నదమ్ములు చెక్కిన 'జంట స్తంభాలు' ఆనాటి నుంచి ఈనాటి వరకూ చూపరులను కట్టిపడేస్తూనే వున్నాయి.

పరివార దేవతలతో విలసిల్లుతోన్న స్వామి వారికి ప్రతియేటా ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. చైత్ర శుద్ధ చతుర్దశి రోజున మొదలయ్యే ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలసంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. యుగయుగాల నుంచి ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోన్నఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles