సరస్వతీ ప్రవాహం

సరస్వతీ ప్రవాహం
సరస్వతీ దేవి విద్యను - విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ... నదిగా అనేక క్షేత్రాలను అభిషేకిస్తూ అనుగ్రహిస్తుంది. సకల విద్యలకు పుట్టినిల్లు అయిన సరస్వతీ దేవి, ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిస్తుంటుంది. పూర్వం మహర్షులు యజ్ఞ యాగాలు చేయాలన్నా ... అవి ఫలించాలన్నా ఈ తల్లి అనుగ్రహాన్ని కోరుతూ ధ్యానించే వారు. చల్లని మనసున్న ఈ తల్లి ... వారి యజ్ఞయాగాలను సఫలీకృతం చేయడానికి ప్రవాహమై ఆ ప్రదేశానికి చేరుకునేది.

ఈ కారణంగా అమ్మవారు వివిధ ప్రదేశాల్లో అనేక పేర్లతో పిలవబడుతోంది. బ్రహ్మ దేవుడు పుష్కర క్షేత్రంలో యజ్ఞం చేస్తోన్న సమయంలో ఆయన కోరికమేరకు అమ్మవారు 'సుప్రభ' పేరున ప్రవహించింది. ఇక మహర్షులంతా నైమిశారణ్యంలో సత్రయాగాన్ని నిర్వహించినప్పుడు, వారి ప్రార్ధన మేరకు 'కాంచనాక్షి' పేరున అక్కడ ప్రత్యక్షమైంది. హరిద్వార్ దగ్గర దక్షుడు చేసిన యజ్ఞానికి అమ్మవారు 'సురేణు' పేరుతో కదిలి వచ్చింది. కురుమహా రాజు అభ్యర్ధన మేరకు 'సరస్వతి' పేరుతో కురుక్షేత్రాన్ని పావనం చేసింది.

ఇక గయ మహారాజు 'గయ'లో తలపెట్టిన యజ్ఞ కార్యానికి అమ్మవారు 'విశాల' పేరున తరలి వచ్చింది. అలాగే అయోధ్యలో శ్వేతకేతు మహారాజు తలపెట్టిన యజ్ఞాన్ని సఫలీకృతం చేయడం కోసం అమ్మవారు 'మనోరమ' పేరుతో అనుగ్రహించింది. ఇలా సరస్వతీ నది అనేక ప్రాంతాలను పావనం చేస్తూ పుణ్య నదిగా విశిష్టమైన స్థానాన్ని దక్కించుకుంది.

More Bhakti Articles